CM Chandrababu: అనకాపల్లి జిల్లా దశ తిరగబోతోంది.. మరో 'రంగారెడ్డి'గా మారుస్తా..
CM Chandrababu: అనకాపల్లి జిల్లాను దేశంలోనే నంబర్ వన్ జిల్లాగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు వెల్లడి. రాంబిల్లిలో రూ. 5,400 కోట్ల క్లీన్ ఎనర్జీ ప్లాంట్‌కు శంకుస్థాపన. 4.76 లక్షల మందికి ఉపాధి లక్ష్యం.
CM Chandrababu: అనకాపల్లి జిల్లా దశ తిరగబోతోంది.. మరో 'రంగారెడ్డి'గా మారుస్తా..
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవానికి అనకాపల్లి జిల్లా కేంద్ర బిందువుగా మారుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. గురువారం రాంబిల్లిలో రూ. 5,400 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న రెన్యువబుల్ ఎనర్జీ సంస్థ 'క్లీన్ ఎనర్జీ ప్లాంట్'కు ఆయన శంకుస్థాపన చేశారు.
ఒకప్పుడు వెనుకబడిన రంగారెడ్డి జిల్లా నేడు దేశంలోనే ధనిక జిల్లాగా ఎదిగిందని, అదే తరహాలో అనకాపల్లిని అభివృద్ధి చేసే బాధ్యత తనదని సీఎం హామీ ఇచ్చారు. విశాఖలో పరిశ్రమలు నిండిపోయాయని, ఇకపై వచ్చే ప్రతి పెట్టుబడి అనకాపల్లికే వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టు ద్వారా 2,100 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఇప్పటికే రూ. 1.36 లక్షల కోట్లతో ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు.
కేంద్రం 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంగా సాగుతుంటే, ఏపీ ఒక్కటే 160 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. గ్రీన్ ఎనర్జీ విభాగంలో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. త్వరలో రాష్ట్రంలో 1,050 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామని, మూడేళ్లలో 5 వేలకు పైగా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఆర్టీసీ బస్సులన్నీ ఎలక్ట్రిక్‌వే ఉంటాయని చంద్రబాబు పేర్కొన్నారు.
2019-24 మధ్య కాలంలో విద్యుత్ రంగం కుప్పకూలిందని, తొమ్మిది సార్లు చార్జీలు పెంచి ప్రజలపై రూ. 32 వేల కోట్ల భారం మోపారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చిన 22 నెలల్లోనే 117 ప్రాజెక్టులను క్లియర్ చేశామని, దీనివల్ల మొత్తం 4.76 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు.




