Tirumala: శ్రీవారికి అనంత్ అంబానీ మెగా విరాళం.. 25 ఎలక్ట్రిక్ బస్సులు, డ్రైవర్ల జీతాలు కూడా రిలయన్స్ సంస్థదే!

Tirumala: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Arun Chilukuri
Published on: 28 Jun 2026 2:35 PM IST
Tirumala
X

Tirumala: శ్రీవారికి అనంత్ అంబానీ మెగా విరాళం.. 25 ఎలక్ట్రిక్ బస్సులు, డ్రైవర్ల జీతాలు కూడా రిలయన్స్ సంస్థదే!

Tirumala: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ఆదివారం (జూన్ 28) ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాధారణ భక్తుడిలా కల్యాణకట్టకు వెళ్లిన అనంత్ అంబానీ.. శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందించగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

దర్శనానంతరం టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో ప్రత్యేకంగా సమావేశమైన అనంత్ అంబానీ.. తిరుమల అభివృద్ధి మరియు భక్తుల సౌకర్యార్థం పలు కీలక విరాళాలను ప్రకటించారు. తిరుమలలో పర్యావరణహిత రవాణా (Green Transport) వ్యవస్థను ప్రోత్సహించేందుకు గానూ సుమారు రూ.27.5 కోట్ల విలువ చేసే 25 అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులను టీటీడీకి విరాళంగా అందజేస్తామని వెల్లడించారు.

కేవలం బస్సులు ఇవ్వడమే కాకుండా.. ఈ 25 ఎలక్ట్రిక్ బస్సులను నడపడానికి అవసరమైన 50 మంది డ్రైవర్ల జీతభత్యాలను కూడా పూర్తి కాలం పాటు రిలయన్స్ సంస్థే భరిస్తుందని అనంత్ అంబానీ ప్రకటించారు. వీటితో పాటు తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జింగ్ కోసం అవసరమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సైతం తమ సంస్థ పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.

జంతు సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపే అనంత్ అంబానీ.. తిరుమల పశు సంరక్షణపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘వంతారా’ (Vantara) జంతు పునరావాస కేంద్రం తరహాలోనే తిరుమల గోశాలను కూడా పూర్తి స్థాయిలో ఆధునీకరించేందుకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆధునిక సదుపాయాలు, మెరుగైన సంరక్షణ షెడ్లు, అడ్వాన్స్‌డ్ పశువైద్య సేవలతో గోశాలను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకువెళ్లేందుకు టీటీడీతో కలిసి సంయుక్తంగా పనిచేయనున్నట్లు వెల్లడించారు.

అనంత్ అంబానీ ప్రకటించిన ఈ మెగా విరాళాలు తిరుమలలో గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్ బలోపేతానికి, మూగజీవాల సంరక్షణకు ఎంతో ఉపయోగపడతాయని టీటీడీ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story