Anantapur: రాప్తాడు ఘటనలో ఊహించని ట్విస్ట్.. ఉన్మాది హేమంత్ కుడికాలు తొలగించే అవకాశం!
Anantapur: రాప్తాడు ఘటన నిందితుడు ఉన్మాది హేమంత్ కుడికాలు తొలగించే అవకాశం. అనంతపురం జీజీహెచ్ సూపరింటెండెంట్ మల్లీశ్వరి హెల్త్ బులెటిన్ వివరాలు.
Anantapur: రాప్తాడు ఘటనలో ఊహించని ట్విస్ట్.. ఉన్మాది హేమంత్ కుడికాలు తొలగించే అవకాశం!
Anantapur: అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై దారుణంగా దాడికి తెగబడిన ఉన్మాది హేమంత్ ఆరోగ్య పరిస్థితిపై అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH) సూపరింటెండెంట్ మల్లీశ్వరి కీలక అప్‌డేట్ వెల్లడించారు. ప్రస్తుతం నిందితుడు హేమంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ సమాధానాలు చెబుతున్నారని తెలిపారు.
అయితే హేమంత్ కుడి కాలుకు తీవ్ర గాయం కావడంతో సగం కాలును తొలగించాల్సిన పరిస్థితి రావచ్చని సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి పేర్కొన్నారు. ఎక్స్-రే రిపోర్టులో కాలి భాగంలో ఎలాంటి బుల్లెట్‌లు కనిపించలేదని స్పష్టం చేశారు. తీవ్ర గాయం కారణంగా హేమంత్ కుడికాలుకు రక్త సరఫరా బాగా తగ్గిపోయిందని, రక్త ప్రసరణ ఎందుకు తగ్గిందనేది ఆపరేషన్ థియేటర్‌లోనే నిష్ణాతులైన వైద్యుల పరిశీలన తర్వాత తేలుతుందని వివరించారు. కాలి భాగంలో రక్త సరఫరా సక్రమంగా ఉంటేనే నరాలు, కండరాలు బాగుంటాయని, ఒకవేళ రక్త ప్రసరణ లేకపోతే కండరాలు పూర్తిగా చెడిపోతాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లో నిందితుడు హేమంత్‌ను ఆపరేషన్ థియేటర్‌కు తరలించనున్నారు. ఎక్స్-రే నివేదికలు, అనస్థేసియా డాక్టర్ నివేదికను సమగ్రంగా పరిశీలించిన తర్వాత ఆర్థోపెడిక్, న్యూరాలజీ నిపుణులైన వైద్య బృందం సర్జరీ నిర్వహించనుంది. పరిస్థితిని బట్టి కుడికాలును తొలగించాలా వద్దా అనే దానిపై శస్త్రచికిత్స సమయంలో ఆపరేషన్ థియేటర్‌లోనే పూర్తి స్పష్టత రానుందని వైద్యులు తెలిపారు.




