CM Chandrababu: పెట్టుబడులకు ఏపీనే అడ్రస్.. చంద్రబాబు కీలక పిలుపు!
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి పెట్టుబడులకు కేంద్ర బిందువుగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.
CM Chandrababu: పెట్టుబడులకు ఏపీనే అడ్రస్.. చంద్రబాబు కీలక పిలుపు!
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి పెట్టుబడులకు కేంద్ర బిందువుగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఢిల్లీలోని భారత్ మంటపంలో నిర్వహించిన '31వ సిఐఐ భాగస్వామ్య సదస్సు 2026' (31st CII Partnership Summit) కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 2024 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో రూ.22.6 లక్షల కోట్ల విలువైన 714 ప్రాజెక్టులతో భారీ పెట్టుబడుల ప్రణాళిక రూపుదిద్దుకుందని వెల్లడించారు. ఇందులో ఇప్పటికే రూ.16.6 లక్షల కోట్ల విలువైన 473 ప్రాజెక్టులకు ప్రభుత్వ ఉత్తర్వులు (GOs) జారీ కాగా, రూ.4.7 లక్షల కోట్ల విలువైన 247 ప్రాజెక్టుల పనులు క్షేత్రస్థాయిలో ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో ఏకంగా 7.1 లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయని స్పష్టం చేశారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ వైపు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" స్థాయి నుంచి "స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" వైపు వేగంగా అడుగులు వేస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సాంకేతిక ఆధారిత పాలన ద్వారా పరిశ్రమలకు వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. డేటా సెంటర్లు, డిజిటల్ మౌలిక వసతులు, రాయలసీమలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఓర్వకల్లులో డ్రోన్ సిటీ, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, గ్రీన్ హైడ్రోజన్ , గ్రీన్ అమ్మోనియా రంగాలలో ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచ పెట్టుబడిదారులకు వివరించారు.
అమరావతిని గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా మారుస్తూ అక్కడ ఒక 'క్వాంటమ్ వ్యాలీ'ని నెలకొల్పుతామని, పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రియల్ టైమ్ గవర్నెన్స్‌ను సంపూర్ణంగా అనుసంధానిస్తున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.36,436.96 కోట్లకు కేంద్రం ఆమోదం తెలిపినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, దక్షిణాది నీటి ఎద్దడిని తీర్చేందుకు గోదావరి-కావేరి నదుల అనుసంధానమే తన ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు.
చంద్రబాబు విజన్, సాంకేతిక సంస్కరణలపై పీయూష్ గోయల్ ప్రశంసలు
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడి విజన్, సంస్కరణల వైఖరి, భవిష్యత్తును ముందుగానే ఊహించే సాంకేతిక దృక్పథాన్ని కొనియాడారు. సాంకేతికత, ఆవిష్కరణలు, డిజిటల్ పాలనపై ఆయన చూపిస్తున్న శ్రద్ధ రాష్ట్రానికి గొప్ప విశ్వసనీయతను తీసుకొచ్చిందని, అది పెట్టుబడులు , సమృద్ధికి మార్గం సుగమం చేస్తుందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు గ్లోబల్ టాలెంట్‌తో సైన్స్, టెక్నాలజీ, గణితం, సంఖ్యల విభాగాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమంగా రాణిస్తున్నారని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతికి, వాణిజ్య, ఎగుమతుల రంగానికి పూర్తిస్థాయిలో సహకరిస్తుందని హామీ ఇచ్చారు.
విశాఖపట్నంలో నవంబర్ 12-13 తేదీల్లో భాగస్వామ్య సదస్సు
రాబోయే రోజుల్లో "నేవిగేటింగ్ ది న్యూ వరల్డ్ ఆర్డర్: ట్రేడ్, టెక్నాలజీ, ట్రస్ట్ అండ్ థాట్ లీడర్‌షిప్" అనే ప్రధాన ఇతివృత్తంతో విశాఖపట్నంలో నవంబర్ 12, 13 తేదీలలో 31వ సిఐఐ భాగస్వామ్య సదస్సు వైభవంగా జరగనుంది. దీనికి ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలు, వాణిజ్య ప్రతినిధులు హాజరుకానున్నారు.
కాగా, అక్టోబర్ 7న విశాఖలో నిర్వహించిన ముందస్తు ప్రాంతీయ సదస్సులోనే రూ.37,261.43 కోట్ల విలువైన 29 ఎంఓయూలు కుదిరాయని, దీని ద్వారా 92,247 మందికి ఉద్యోగాలు రానున్నాయని అధికారులు వెల్లడించారు. వేగం, స్థాయి, స్థిరత్వం, నికార్సైన పాలన (Speed, Scale, Stability and Sincerity) అనే విధానంతో ముందుకు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్‌లో భాగస్వాములు కావాలని ప్రపంచ పారిశ్రామిక రంగానికి చంద్రబాబు పిలుపునిచ్చారు.




