AP Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్‌డేట్.. క్లారిటీ వచ్చేసిందోచ్
AP Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మునుపెన్నడూ లేనంతగా రాజకీయం వేడెక్కింది.
AP Local Elections
AP Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక పోరుకు సంబంధించి రోజుకో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంటోంది. ప్రస్తుతం జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ ముగిసి, తుది ఓటర్ల జాబితా బయటకు వచ్చే వరకు స్థానిక ఎన్నికలను నిలిపివేయాలంటూ వైఎస్సార్‌సీపీ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే సమయానికి అధికారికంగా అమల్లో ఉండే ఓటర్ల జాబితా ప్రాతిపదికగానే ముందుకు వెళ్లవచ్చని సర్కార్ బలంగా వాదిస్తోంది. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని, చట్టబద్ధమైన జాబితాతోనే పోలింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేస్తోంది.
బీసీ రిజర్వేషన్ల చిక్కు ముడి విప్పేలా వ్యూహం
ఓటర్ల జాబితా వివాదంతో పాటు బీసీ రిజర్వేషన్ల అంశం కూడా ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. రిజర్వేషన్ల పరిమితిపై న్యాయపరమైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఒకవేళ న్యాయపరమైన చిక్కుల వల్ల బీసీ రిజర్వేషన్ల శాతంలో మార్పులు చేయాల్సి వస్తే, పార్టీ పరంగా బీసీ అభ్యర్థులకు జనరల్ స్థానాల్లో కూడా టికెట్లు కేటాయించి న్యాయం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. బీసీ వర్గాలకు రాజకీయంగా ఎలాంటి అన్యాయం జరగకుండా ఉండేలా ఈ వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తున్నారు.
మున్సిపాలిటీలే తొలి లక్ష్యం
ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌పై కూడా ఇప్పటికే ఒక స్పష్టమైన ప్రతిపాదన సిద్ధమైంది. అడ్డంకులన్నీ తొలిగిపోయిన వెంటనే మొదటగా పురపాలక సంఘాలు (మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు) ఎన్నికలను పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఆ తర్వాత రెండవ విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక ఆఖరి విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసేలా మూడు దశల ప్రణాళికను సిద్ధం చేశారు.
అక్టోబర్ గడువుతో శరవేగంగా ఏర్పాట్లు
ఎన్నికలు ఏ కారణం చేతనైనా వాయిదా పడే ప్రసక్తే లేదని పాలకవర్గం తేల్చిచెప్పింది. న్యాయస్థానాల్లో ఉన్న కేసుల పరిష్కారానికి అధికారుల బృందం నిరంతరం శ్రమిస్తోంది. అటు నియోజకవర్గాల వారీగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, అధికారుల నియామకం వంటి పరిపాలనాపరమైన ఏర్పాట్లను వేగవంతం చేశారు. న్యాయపరమైన సవాళ్లను దాటుకుంటూ అక్టోబర్ నెల ముగిసేలోగా ప్రజాస్వామ్య ప్రక్రియను విజయవంతంగా ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.




