Pulse Polio : ఐదేళ్లలోపు పిల్లలుంటే మిస్ కావొద్దు.. నేడే పోలియో చుక్కలు.!
Pulse Polio : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేడు పల్స్ పోలియో కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానుంది. ఐదేళ్లలోపు చిన్నారులను పోలియో..
Pulse-Polio
Pulse Polio : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేడు పల్స్ పోలియో కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానుంది. ఐదేళ్లలోపు చిన్నారులను పోలియో మహమ్మారి బారి నుంచి రక్షించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయడమే లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖ రంగంలోకి దిగింది.
ఉండవల్లిలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
ఈ బృహత్తర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించనున్నారు. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఆయన ఈ డ్రైవ్‌ను మొదలుపెడతారు. అలాగే, ఉత్తరాంధ్రలోని కీలక నగరమైన విశాఖపట్నంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్వయంగా పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఆయా జిల్లాల్లో ఈ కార్యక్రమంలో పాల్గొని పర్యవేక్షించనున్నారు.
49.20 లక్షల మంది చిన్నారులే లక్ష్యం
రాష్ట్రంలో సుమారు 49.20 లక్షల మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం వేలాదిగా పోలియో కేంద్రాలను (బూత్‌లను) ఏర్పాటు చేశారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు వంటి రద్దీ ప్రాంతాల్లోనూ ప్రయాణాల్లో ఉండే పిల్లల కోసం ప్రత్యేక మొబైల్ బూత్‌లను అందుబాటులో ఉంచారు. ఎవరైనా చిన్నారులు ఈరోజు పోలియో చుక్కలు వేయించుకోలేకపోతే.. రాబోయే రెండు రోజుల్లో వైద్య సిబ్బంది నేరుగా ఇళ్లకు వెళ్లి (డోర్-టు-డోర్) చుక్కలు వేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
తల్లిదండ్రులకు అధికారుల విజ్ఞప్తి
ఐదేళ్లలోపు వయసున్న ప్రతి ఒక్క చిన్నారికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో చుక్కలు వేయించినప్పటికీ.. ఈ విడతలో మళ్లీ వేయించడం సురక్షితమని స్పష్టం చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఏపీని పోలియో రహిత రాష్ట్రంగా కొనసాగించడంలో భాగస్వాములు కావాలని కోరారు.




