Weather Update : తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం.. ఒకచోట వరుణుడి పలకరింపు.. మరోచోట భానుడి ప్రతాపం
Weather Update : ఏపీలో ఆదివారం భిన్న వాతావరణం ఉండనుంది. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండగా, మరికొన్ని చోట్ల తీవ్ర వడగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు.
Weather Update : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం దోబూచులాడుతోంది. ఒకవైపు ఎండలు మండిపోతుంటే, మరోవైపు అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమై వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి భిన్నమైన పరిస్థితులే ఉండబోతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంటే, మరికొన్ని చోట్ల వడగాలులు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేయనున్నాయి.
ట్రోపో ఆవరణంలో వీస్తున్న గాలులు, ద్రోణి ప్రభావం వల్ల కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో వానలు పడవచ్చు. అలాగే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి చిరుజల్లులు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. అయితే, వర్షంతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున బయట తిరిగే వారు జాగ్రత్తగా ఉండాలి.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. వర్షం పడుతున్నప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ చెట్ల కింద నిలబడకూడదని, బహిరంగ ప్రదేశాల్లో ఉండటం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందడం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు.
వర్షాల సంగతి పక్కన పెడితే, కొన్ని మండలాల్లో ఎండ తీవ్రత రికార్డు స్థాయిలో ఉండబోతోంది. అల్లూరి జిల్లాలోని అనంతగిరి, పోలవరం జిల్లాలోని గుర్తేడు, అనకాపల్లి జిల్లాలోని కె.కోటపాడు మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది. వీటితో పాటు మరో ఏడు మండలాల్లో సాధారణ వడగాలులు వీస్తాయి. అల్లూరి జిల్లాలోని ముంచింగిపుట్టు, అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం, చోడవరం, పరవాడ వంటి ప్రాంతాల్లో వేడి గాలులు జనాన్ని ఇబ్బంది పెడతాయి. ఎండ తీవ్రత దృష్ట్యా వృద్ధులు, పిల్లలు మధ్యాహ్నం వేళ బయటకు రాకపోవడమే మంచిది.
శనివారం నాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎండలు దంచికొట్టాయి. కర్నూలు జిల్లా తోవిలో అత్యధికంగా 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పోలవరం (40.5 డిగ్రీలు), నంద్యాల (40.4 డిగ్రీలు), కడప, ఏలూరు (40.3 డిగ్రీలు) ప్రాంతాల్లో కూడా భానుడు సెగలు చిమ్మారు. అటు ఎండ, ఇటు వాన.. ఈ రెండింటి మధ్య ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ప్రకృతి వైపరీత్యాల నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు.




