CII Summit: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. సీఐఐ సమ్మిట్‌లో తొలిరోజే రూ.5.84 లక్షల కోట్ల ఒప్పందాలు..!

CII Summit: సీఐఐ సమ్మిట్ తొలిరోజే ఆంధ్రప్రదేశ్‌కు రూ.5.84 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి.

Gagan kumar
Published on: 13 Nov 2026 11:22 AM IST
CII Summit
X

CII Summit: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. సీఐఐ సమ్మిట్‌లో తొలిరోజే రూ.5.84 లక్షల కోట్ల ఒప్పందాలు..!

AP Investment: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖచిత్రం వేగంగా మారుతోంది. పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీ మరోసారి తన సత్తా చాటింది. సీఐఐ సమ్మిట్ తొలిరోజే ఏకంగా ఐదు లక్షల ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు కుదరడం ఒక చారిత్రక రికార్డు. ఒక్కరోజే ఎనభై ఎనిమిది ఒప్పందాలు జరగ్గా, అందులో డెబ్బై మూడు ఎంఓయూలు, పదిహేను జీవోలు ఉన్నాయి. ఈ భారీ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలోని లక్షా ఏడు వేల ఆరు వందల తొంభై మూడు మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ఈ పెట్టుబడుల ప్రవాహంలో దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో నిలిచింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రిలయన్స్ సంస్థ రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయల భారీ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో రష్మీ మెటలర్జికల్ ఇండస్ట్రీ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో పరిశ్రమను స్థాపించనుంది. రాయలసీమ జిల్లాలకు సైతం భారీగా పరిశ్రమలు తరలివస్తున్నాయి. అనంతపురంలో కియా మోటార్స్ పద్దెనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల విస్తరణకు ముందుకొచ్చింది. కడప జిల్లాలో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ పదిహేను వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

భవిష్యత్ ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకుని రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో లక్షా అరవై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి. ఈ విభాగంలో గ్రీన్‌కో నలభై ఐదు వేల కోట్ల రూపాయలు, క్లీన్‌మ్యాక్స్ నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు, మేఘా ఇంజినీరింగ్ సంస్థ ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి.

ఆధునిక సాంకేతిక రంగాలైన ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల విభాగంలో నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగాయి. ఫ్యాబ్రిక్ సంస్థ ద్వారా పది వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. వీటితో పాటు ఆటోమొబైల్ మరియు ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో ఇరవై ఒక్క వేల రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు, కెమికల్స్ , పెట్రో కెమికల్స్ రంగంలో పందొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో నాలుగు వేల ఏడు వందల డెబ్బై కోట్ల రూపాయల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది.

పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానంగా మారిందని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాత్రమే కాకుండా, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తమ ప్రభుత్వ విధానమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అయితే, భవిష్యత్తులో ప్రభుత్వాలు మారితే తమ ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటన్న ఆందోళన పారిశ్రామికవేత్తల్లో సహజంగానే ఉంటుంది. ఈ సందేహాలకు తెరదించుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక కీలక ప్రకటన చేశారు. పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడేందుకు త్వరలోనే ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ చట్టం ద్వారా పారిశ్రామికవేత్తలకు పూర్తిస్థాయి భరోసా లభిస్తుంది.

రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి మొత్తం ఇరవై రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో పదిహేడు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయల విలువైన ఐదు వందల ఇరవై ఆరు ప్రాజెక్టులు ఒప్పందాల దశకు చేరుకోవడం విశేషం. ఇప్పటికే ఏడు లక్షల పది వేల కోట్ల రూపాయల విలువైన మూడు వందల మూడు ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించుకుని గ్రౌండింగ్ దశలో ఉన్నాయి. ప్రతిపాదిత ఇరవై రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పూర్తిస్థాయిలో గ్రౌండింగ్ అయితే, రాష్ట్రంలో పందొమ్మిది లక్షల ముప్పై వేల ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమం అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతికి, యువత ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నాయి.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.