AP Weather: ఏపీలో నిప్పుల కొలిమి.. రెండు రోజులు వడగాలుల హెచ్చరిక

AP Weather: ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రతపై విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.

HARIKISHAN
Published on: 12 April 2026 9:56 PM IST
AP Weather
X

AP Weather: ఏపీలో నిప్పుల కొలిమి.. రెండు రోజులు వడగాలుల హెచ్చరిక

AP Weather: రాష్ట్రంలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. సోమవారం, మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా వడగాలుల ప్రభావం అధికంగా ఉండే అవకాశముందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. సోమవారం రాష్ట్రంలోని 51 మండలాల్లో తీవ్ర వడగాలులు, 49 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే మంగళవారం పరిస్థితి మరింత తీవ్రమై 53 మండలాల్లో తీవ్ర వడగాలులు, 57 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించారు.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో ముఖ్యంగా వడగాలులు ఎక్కువగా వీచే అవకాశం ఉండగా, కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. ఈ పరిస్థితులు మరికొన్ని రోజులు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప ఎండలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సోమవారం (13-04-2026) జిల్లాల వారీగా చూస్తే, శ్రీకాకుళం జిల్లాలో 9 మండలాలు, విజయనగరం జిల్లాలో 18 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో 15 మండలాలు తీవ్ర వడగాలుల ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, ఏలూరు జిల్లాల్లో కూడా కొన్ని మండలాల్లో తీవ్ర వడగాలులు నమోదవుతాయని పేర్కొన్నారు. అదే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల జిల్లాల్లో మొత్తం 49 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని తెలిపారు.

ఇప్పటికే ఆదివారం నమోదైన ఉష్ణోగ్రతలు పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నాయి. కడప జిల్లాలోని పొట్టిపాడు వద్ద 43.8 డిగ్రీల సెల్సియస్, తిరుపతి జిల్లాలో వరదయ్యపాలెంలో 43.1 డిగ్రీలు, నంద్యాలలో 42.9 డిగ్రీలు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో తెరన్నపల్లె వద్ద 42.3 డిగ్రీలు, కర్నూలు జిల్లాలో గూడూరు వద్ద 42.1 డిగ్రీలు నమోదయ్యాయి. పల్నాడు జిల్లాలో దుర్గి 41.8 డిగ్రీలు, శ్రీసత్యసాయి జిల్లాలో బుక్కపట్నం 41.6 డిగ్రీలు, నెల్లూరు, మార్కాపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కూడా 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

ఈ పరిస్థితుల్లో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తలకు టోపీ ధరించడం, తెలుపు రంగు కాటన్ దుస్తులు వేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే కళ్లను రక్షించుకోవడానికి సన్ గ్లాసెస్ ఉపయోగించాలని, చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకుండా ఉండాలని హెచ్చరించారు.

అదే విధంగా శరీరంలో నీరు తగ్గకుండా ఉండేందుకు నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు, తాగునీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లడం తగ్గించడం, నీడ ఉన్న ప్రదేశాల్లో ఉండడం వంటి జాగ్రత్తలు పాటిస్తే వడగాలుల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. మొత్తంగా ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

HARIKISHAN

HARIKISHAN

Next Story