AP Weather Update : ఏపీలో వదలని వానలు.. ఇవాళ ఆ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
AP Weather Update : ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాల విస్తరణతో వానలు కొనసాగుతున్నాయి. రాబోయే రెండు రోజులు కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
AP Weather Update
AP Weather Update : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం చల్లబడింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానలు ఇవాళ కూడా కొనసాగే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా మెల్లిగా విస్తరిస్తుండటంతో రాబోయే రోజుల్లో వర్షాలు మరింత ఊపందుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు
విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లా (పోలవరం ప్రాంతం)లలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని అంచనా వేస్తున్నారు.
రైతులు, శ్రామికులకు పిడుగుల హెచ్చరిక
వర్షాలు పడే సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఎక్కువగా ఉందని అధికారులు హెచ్చరించారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ శ్రామికులు, పశువుల కాపరులు, చెట్ల కింద ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా, వెంటనే సురక్షితమైన పక్కా భవనాల్లోకి వెళ్లాలని విపత్తుల నిర్వహణ సంస్థ గట్టిగా సూచించింది.
బలమైన ఈదురుగాలులు.. ఐఎండీ నివేదిక
మరోవైపు భారత వాతావరణ శాఖ కూడా ఏపీ వాతావరణంపై కీలక అప్‌డేట్ ఇచ్చింది. శుక్రవారం, శనివారం రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. వానలు పడే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, అందువల్ల ప్రయాణికులు, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అయితే కొన్ని ప్రాంతాల్లో వానలు పడుతున్నప్పటికీ, మరికొన్ని చోట్ల ఎండ తీవ్రత, ఉక్కపోత కూడా కొనసాగుతుండటం గమనార్హం.
రాష్ట్రంలో నమోదైన వర్షపాతం వివరాలు
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లిలో అత్యధికంగా 5.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అలాగే కృష్ణా జిల్లా గుడివాడలో 3.5 సెం.మీ, పార్వతీపురంలో 3.5 సెం.మీ, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో 3.3 సెం.మీ, ఏలూరు జిల్లా భీమడోలులో 3 సెం.మీ, కైకలూరులో 2.9 సెం.మీ, విజయనగరంలో 2.7 సెం.మీ, కోనసీమ జిల్లా అమలాపురంలో 2.6 సెం.మీ, ఎన్టీఆర్ జిల్లా పాలేరు బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో 2.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
రైతులకు అలర్ట్.. ఎల్‌నినో ప్రభావం
ఈసారి ఆంధ్రప్రదేశ్‌పై ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీనివల్ల రుతుపవనాల గమనంలో మార్పులు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ అధికారులు రైతులను ముందుగానే అలర్ట్ చేశారు. పంటల సాగు విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాల లభ్యత, వాతావరణ మార్పులను గమనిస్తూ, దానికి తగినట్లుగా విత్తనాలు వేసుకోవాలని, సాగు నీటి నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలని రైతులకు మార్గదర్శకాలు జారీ చేశారు.




