Kollu Ravindra: ఆధార్‌ కార్డు ఉంటే చాలు.. మద్యం షాపు లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు

Kollu Ravindra: ఆధార్‌ కార్డు ఉంటే చాలు ఎవరైనా మద్యం షాపు లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అక్టోబర్ 5న లక్కీ డ్రా ద్వారా షాపులు కేటాయిస్తామన్నారు.

Arun Chilukuri
Published on: 26 Sept 2026 5:37 PM IST
Kollu Ravindra
X

Kollu Ravindra: ఆధార్‌ కార్డు ఉంటే చాలు.. మద్యం షాపు లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు

Kollu Ravindra: ఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం విధానానికి సంబంధించి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన చేశారు. విశాఖపట్నంలో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. అర్హత గల ప్రతి ఒక్కరూ మద్యం షాపుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. కేవలం ఆధార్‌ కార్డు ఉంటే చాలు, ఎవరైనా మద్యం షాపు లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వచ్చే అక్టోబరు 5న డ్రా తీసి పారదర్శక పద్ధతిలో దుకాణాలు కేటాయిస్తామన్నారు.

రాష్ట్రంలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా.. డిస్టలరీల నుంచి మద్యం షాపుల వరకు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ ఉంటుందని మంత్రి తెలిపారు. వినియోగదారుల సౌలభ్యం కోసం 'ఎక్సైజ్ సురక్షా యాప్‌'ను అందుబాటులోకి తెచ్చామని, దీని ద్వారా మద్యం బాటిల్‌ను స్కాన్ చేసి దాని పూర్తి వివరాలు సులభంగా తెలుసుకోవచ్చని చెప్పారు. కల్తీ మద్యం తయారు చేసి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని చూసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గత వైకాపా హయాంలో మద్యం పాలసీని పూర్తిగా అవినీతిమయం చేశారని, మద్యం రవాణాలోనూ అక్రమాలకు పాల్పడి రూ.కోట్లు దోచుకున్నారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అవినీతికి అవకాశం లేకుండా ప్రక్షాళన చేశామన్నారు. రాష్ట్రంలో దాదాపు 80 శాతం కొత్త బ్రాండ్‌లను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆల్కహాల్ శాతం తక్కువగా ఉండే మద్యాన్ని ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి సూచించారని, ఆ దిశగానే ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.