Weather Update : 47 డిగ్రీలకు చేరనున్న భానుడి భగభగలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అత్యవసర హెచ్చరిక

Weather Update : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని, వడగాల్పుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

CR Reddy
Published on: 22 May 2026 7:08 AM IST
Weather Update
X

Weather Update

Weather Update : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మునుపెన్నడూ లేని విధంగా మండిపోతున్నాయి. ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తోందా అన్నట్లుగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను వడగాల్పులు అతలాకుతలం చేస్తున్నాయి. రానున్న నాలుగు రోజుల పాటు ఎండల తీవ్రత ఇలాగే కొనసాగుతుందని, కొన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఏకంగా 47 డిగ్రీల మార్కును తాకే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

పల్నాడు, ప్రకాశంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండ తీవ్రత ఊహించని స్థాయికి చేరుకుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 28 జిల్లాలకు గాను 18 జిల్లాల పరిధిలోని సుమారు 204 మండలాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటేశాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో 23 మండలాలు, కృష్ణాలో 21, ప్రకాశం జిల్లాలో 20, ఏలూరులో 20, బాపట్లలో 17, నెల్లూరులో 16, ఎన్టీఆర్ జిల్లాలో 15, గుంటూరులో 15 మండలాల్లో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. రానున్న రెండు రోజులు ఈ జిల్లాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉంది.

మే 22, 23 తేదీల్లో ఉష్ణోగ్రతలు ఎక్కడ ఎంతంటే?

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం మే 22 శుక్రవారం రోజున కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఎండలు 45 నుండి 47 డిగ్రీల వరకు నమోదయ్యే ముప్పు ఉంది. కాకినాడ, నంద్యాల, కడప జిల్లాల్లో 44 నుండి 45 డిగ్రీల వరకు, మిగిలిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో 40 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉండనున్నాయి. ఇక మే 23 శనివారం రోజున కూడా ఏలూరు, పల్నాడు, నెల్లూరు సహా పలు జిల్లాల్లో 44 నుండి 45 డిగ్రీల మేర ఎండలు మండిపోనున్నాయి.

తెలంగాణలోనూ అదే అరాచకం

ఇటు తెలంగాణను కూడా ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. రాబోయే రోజుల్లో వడగాల్పుల తీవ్రత మరింత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త జీఎన్‌ఆర్‌ఎస్ శ్రీనివాసరావు హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటేశాయి. తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరో ఐదు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కూడా వడగాల్పుల తీవ్రత ఒక్కసారిగా పెరగనుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం 39 నుండి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచనలు

తీవ్రమైన ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు మధ్యాహ్నం పూట బయటకు రాకూడదు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే తల, చెవులకు వేడిగాలి తగలకుండా గుడ్డ కట్టుకోవాలి. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు మంచినీళ్లతో పాటు నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు కోరుతున్నారు.

ఎండలతో అల్లాడుతున్న జనానికి గుడ్ న్యూస్

భానుడి భగభగలతో విలవిలలాడుతున్న తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ ఒక చల్లటి కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే బంగాళాఖాతంలోకి ప్రవేశించాయని, అండమాన్ నికోబార్ దీవులను దాటుకుని వేగంగా దూసుకువస్తున్నాయని శాస్త్రవేత్త శ్రీనివాసరావు తెలిపారు. మే 25 నుంచి 28 మధ్య ఈ రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. అక్కడ నుండి తెలంగాణ, ఏపీలకు చేరుకోవడానికి మరో వారం రోజుల సమయం పడుతుంది. ఈ లెక్కన జూన్ మొదటి వారంలోనే తెలుగు రాష్ట్రాల్లో తొలి రుతుపవన వర్షాలు కురిసి, ఎండల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story