AP Anna Canteens : ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్.. రేపటి నుంచే అక్కడ కూడా క్యాంటీన్లు షురూ

AP Anna Canteens : ఏపీలో అన్న క్యాంటీన్లు గ్రామాలకు కూడా విస్తరించాయి. ఏప్రిల్ 15న సీఎం చంద్రబాబు 62 కొత్త క్యాంటీన్లను ప్రారంభిస్తారు. కేవలం రూ. 5కే రుచికరమైన భోజనం అందిస్తున్నారు.

CR Reddy
Published on: 14 April 2026 7:51 AM IST
AP Anna Canteens
X

AP Anna Canteens

AP Anna Canteens : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత పేదలకు కూటమి ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను ప్రభుత్వం గ్రామాలకు కూడా విస్తరిస్తోంది. కేవలం రూ.5లకే కడుపునిండా భోజనం పెట్టే ఈ పథకం ఇప్పుడు పల్లె ప్రజలకు చేరువ కానుంది. ఈ నెల 15వ తేదీ నుంచి కొత్తగా ఏర్పాటు చేసిన 62 అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. వీటిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రారంభించనున్నారు.

గ్రామాలకు చేరిన అన్న క్యాంటీన్లు

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు పెద్దపీట వేసింది. ఇప్పటివరకు ప్రధానంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వంటి పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఈ సేవలు, ఇప్పుడు మండల కేంద్రాల ద్వారా గ్రామాలకు చేరుతున్నాయి. కొత్తగా నిర్మించిన 62 క్యాంటీన్లను ఈ నెల 15న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని ధరణికోటలో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా అక్కడే ప్రజలతో కలిసి సీఎం భోజనం చేయనుండటం విశేషం.

రికార్డు స్థాయిలో లబ్ధిదారులు

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 269 క్యాంటీన్లు సేవలందిస్తున్నాయి. ఇప్పటివరకు సుమారు 8.80 కోట్ల మంది ప్రజలు అన్న క్యాంటీన్ల ద్వారా తక్కువ ధరకే పౌష్టికాహారాన్ని పొందారు. ఒక్కో క్యాంటీన్‌లో ప్రతిరోజూ వెయ్యి మందికి పైగా భోజనం చేస్తున్నారు. ప్రస్తుతం రోజూ 2.10 లక్షల మంది ఈ పథకాన్ని వాడుకుంటుండగా, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడంతో ఈ సంఖ్య గణనీయంగా పెరగనుంది. ప్రభుత్వం పేదల కోసం రోజుకు రూ.54 లక్షల వరకు సబ్సిడీ భారాన్ని మోస్తోంది. ఇప్పటివరకు సుమారు రూ.243 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం, గ్రామీణ విస్తరణ కోసం అదనంగా రూ.58 కోట్లు వెచ్చించింది.

రుచికరమైన మెనూ.. క్వాలిటీ భోజనం

అన్న క్యాంటీన్లలో మెనూ చాలా పద్ధతిగా ఉంటుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా ఇడ్లీ, పూరీ, ఉప్మా లేదా పొంగల్ వంటివి అందిస్తారు. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో వేడివేడి అన్నం, పప్పు, సాంబార్, ఒక కూర, పచ్చడి, పెరుగు అందిస్తున్నారు. కేవలం ఐదు రూపాయలకే ఇంత నాణ్యమైన ఆహారం దొరకడంపై సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం తప్ప మిగిలిన ఆరు రోజులు ఈ క్యాంటీన్లు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. పల్లె ప్రజలు కూడా నాణ్యమైన భోజనం పొందాలనే లక్ష్యంతోనే ఈ విప్లవాత్మక మార్పును తీసుకొచ్చారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story