Liquor Policy : మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. మార్కెట్లోకి సరికొత్త సైజుల్లో లిక్కర్ బాటిల్స్

Liquor Policy : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 150ml, 200ml మద్యం సీసాలు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు తెలంగాణలో మద్యం ధరలను 10 శాతం వరకు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

CR Reddy
Published on: 6 Jun 2026 7:08 AM IST
Liquor Policy
X

Liquor Policy 

Liquor Policy : ఆంధ్రప్రదేశ్‎లోని మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త గుడ్ న్యూస్ అందించింది. మార్కెట్లో కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా సరికొత్త సైజుల్లో మద్యం బాటిళ్లను అందుబాటులోకి తీసుకురావాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ఏపీలో 90 ఎంఎల్, 180 ఎంఎల్ (క్వార్టర్), 375 ఎంఎల్ (హాఫ్), 750 ఎంఎల్ (ఫుల్), 1000 ఎంఎల్ (లీటర్) పరిమాణాల్లో మాత్రమే లిక్కర్ బాటిళ్లు సరఫరా అవుతున్నాయి. అయితే వీటికి అదనంగా ఇకపై మార్కెట్లోకి కొత్తగా 150 ఎంఎల్, 200 ఎంఎల్ సైజుల్లో కూడా బాటిల్స్ రానున్నాయి. ఈ మేరకు చౌక మద్యం (ఐఎంఎఫ్ఎల్) నిబంధనలను సవరిస్తూ ఎక్సైజ్ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

లిక్కర్ కంపెనీల కోరిక మేరకు రూల్స్ సవరణ

కొత్త సైజుల్లో సరికొత్త బాటిళ్లను తయారు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కొన్ని ప్రముఖ మద్యం తయారీ కంపెనీలు ఇటీవల ఏపీ ప్రభుత్వాన్ని కోరాయి. అంతర్జాతీయంగా 200 ఎంఎల్ బాటిళ్లను తయారు చేసే మౌల్డులు సులభంగా లభిస్తాయని, దీనివల్ల ఉత్పత్తి వ్యయం కూడా తగ్గుతుందని కంపెనీలు ప్రతిపాదించాయి. ఈ అభ్యర్థనను సానుకూలంగా పరిశీలించిన ప్రభుత్వం పాత నిబంధనలను మారుస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కొత్త సైజుల్లో మద్యం అందుబాటులోకి వస్తున్నప్పటికీ, ధరల విధానంలో ఎలాంటి మార్పులు ఉండబోవని.. ప్రస్తుతం అమల్లో ఉన్న రేట్ల ప్రాతిపదికనే ఈ కొత్త సీసాల ధరలు కూడా ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.

కొత్త రూల్స్ ప్రకారం ఒక కేసులో ఎన్ని సీసాలు ఉంటాయంటే?

ఈ సరికొత్త ప్యాకింగ్ విధానానికి సంబంధించి ఎక్సైజ్ శాఖ ఒక కేసులో (కార్టన్ బాక్స్) ఏ సైజు సీసాలు ఎన్ని ఉండాలనే నిబంధనలను కూడా ఖరారు చేసింది. కొత్తగా రాబోయే 200 ఎంఎల్ సైజు బాటిళ్లు ఒక కేసులో 45 ఉంటాయి. అలాగే 150 ఎంఎల్ సైజు బాటిళ్లయితే ఒక కేసులో 60 సీసాలు ప్యాక్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిబంధనల ప్రకారం ఒక కేసులో 180 ఎంఎల్ (క్వార్టర్) బాటిళ్లు 48, ఇక 375 ఎంఎల్ (హాఫ్) బాటిళ్లు 24, అలాగే 750 ఎంఎల్ (ఫుల్) బాటిళ్లు 12 చొప్పున వస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి జరిగే అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు కూడా ఈ చిన్న బాటిళ్లు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.

తెలంగాణలో మందుబాబులకు త్వరలోనే షాక్

అటు ఆంధ్రప్రదేశ్‌లో మద్యం సైజుల్లో ఇటువంటి మార్పులు చోటుచేసుకోగా.. ఇటు తెలంగాణలో మాత్రం మద్యం ప్రియులకు త్వరలోనే పెద్ద షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మద్యం ధరలను భారీగా పెంచేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సన్నాహాలు చేస్తోంది. గాజు సీసాల తయారీ ఖర్చులు, ఇంధన ధరలు, రవాణా వ్యయం గణనీయంగా పెరిగిపోవడంతో మద్యం ధరలను సవరించాలని తయారీ కంపెనీలు ఎప్పటి నుంచో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ ధరల సవరణ ప్రక్రియపై ప్రభుత్వం ఇటీవల ఒక త్రిసభ్య కమిటీని నియమించింది.

10 శాతం పెంచాలని డిమాండ్ చేస్తున్న కంపెనీలు

లిక్కర్ తయారీ సంస్థలు రాష్ట్రంలో మద్యం ధరలను కనీసం 10 శాతం వరకు పెంచాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ త్రిసభ్య కమిటీ కూడా ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ధరల పెంపును సిఫార్సు చేసినట్లు సమాచారం. అయితే సామాన్య వినియోగదారులపై ఒకేసారి అంత భారం వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని తెలుస్తోంది. కాకపోతే ప్రీమియం బ్రాండ్లపై ఫుల్ బాటిల్‌కు రూ.100 వరకు, సాధారణ బ్రాండ్లపై రూ.60 నుంచి రూ.120 వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. ఈ ధరల పెంపు ద్వారా ప్రభుత్వానికి నెలకు అదనంగా రూ.130 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు ఆదాయం సమకూరనుంది. దీనిపై ఈ నెలలోనే తుది అధికారిక ప్రకటన వెలువడనుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story