AP BC Reservations : బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు ఏపీ..

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (BCs) 34 శాతం రిజర్వేషన్ల అమలుపై రాజకీయం, న్యాయపోరాటం తీవ్ర స్థాయికి చేరింది. స్థానిక సంస్థల్లో

G Krishna
Published on: 2 Oct 2026 12:44 PM IST
supreme court
X

supreme court

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (BCs) 34 శాతం రిజర్వేషన్ల అమలుపై రాజకీయం, న్యాయపోరాటం తీవ్ర స్థాయికి చేరింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం కోటా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవోలను ఏపీ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో, కూటమి ప్రభుత్వం తదుపరి న్యాయ పోరాటానికి సమాయత్తమైంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో రేపు (శనివారం) ఎస్‌ఎల్‌పీ (స్పెషల్ లీవ్ పిటిషన్) దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.

సీఎం చంద్రబాబు శనివారమే పిటిషన్ ఫైల్ చేయాలని ఆదేశాలు

ఈ సున్నితమైన అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు ఇచ్చారు. శనివారం మధ్యాహ్నానికల్లా పిటిషన్‌ను సుప్రీంకోర్టులో దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు. దీనిపై శనివారం పిటిషన్ ఫైల్ కాగానే, వచ్చే వారంలోనే ఇది విచారణకు వచ్చే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. పిటిషన్ రూపకల్పన, న్యాయపరమైన అంశాల సమగ్ర విశ్లేషణ కోసం ముఖ్యమంత్రి ఢిల్లీలోని ప్రముఖ న్యాయనిపుణులతో స్వయంగా మాట్లాడారు. సుప్రీంకోర్టులో పంచాయతీరాజ్, పురపాలక శాఖల తరఫున సమర్థవంతంగా వాదనలు వినిపించేందుకు దేశంలోనే అత్యున్నత శ్రేణి సీనియర్ న్యాయవాదులను నియమించాలని ఆదేశించారు.

34 శాతం రిజర్వేషన్ల హామీకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది

ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీకి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, వారికి స్థానిక సంస్థల్లో 34 శాతం ప్రాతినిధ్యం దక్కాలన్నదే తమ ఆకాంక్ష అని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. బీసీల సామాజిక, రాజకీయ ప్రాతినిధ్యాన్ని కాపాడేందుకు న్యాయపరంగా ఎంతదూరమైనా వెళ్తామని ప్రకటిస్తోంది. అయితే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ జారీ చేసిన రెండు జీవోలను ధర్మాసనం కొట్టివేసింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితికి మించకూడదని, ప్రస్తుతం ప్రభుత్వం కేటాయించిన బీసీ రిజర్వేషన్లతో కలిపి మొత్తం కోటా ఆ పరిమితిని దాటుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అదే సమయంలో ఆరు వారాల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాల దృష్ట్యా ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల శాతాన్ని ఎలా నిలబెట్టుకోవాలనే దానిపై సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలే ఇప్పుడు అత్యంత కీలకంగా మారాయి.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.