AP Cabinet Meeting: కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ.. ‘తల్లికి వందనం’ నిధుల విడుదలపై చంద్రబాబు కీలక చర్చ!
AP Cabinet Meeting: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ కీలక సమావేశం కానుంది.
AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కాసేపట్లో రాష్ట్ర మంత్రివర్గ (AP Cabinet) సమావేశం ప్రారంభం కానుంది. వెలగపూడిలోని సచివాలయంలో జరగనున్న ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, రాజధాని అమరావతి మౌలిక సదుపాయాలు మరియు పలు కీలక సంక్షేమ పథకాల నిధుల విడుదలపై మంత్రివర్గం చర్చించి ఆమోద ముద్ర వేయనుంది.
రాజధాని ప్రాంతాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. హైకోర్టు భవనాల పరిసర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాజధాని పరిధిలో నిర్మాణాల క్రమబద్ధీకరణ, పర్యవేక్షణ కోసం 'CRDA బిల్డింగ్ ట్రైబ్యునల్' ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. 9 జిల్లాల పరిధిలో అమరావతి ఎకనామిక్ రిజియన్ ఆర్‌ఎఫ్‌సీ (RFC) ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.
పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) ప్రాతిపదికన ‘డిజైన్ బిల్డ్ ఆపరేట్ ట్రాన్సఫర్’ (DBOT) విధానంలో అమరావతిలో పర్యాటకాన్ని భారీగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా అంతర్జాతీయ స్థాయిలో ఆకర్షణగా నిలిచే ‘జెయింట్ అబ్జర్వేషన్ వీల్’ (Giant Observation Wheel) నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది.
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన "తల్లికి వందనం" పథకానికి సంబంధించిన నిధుల విడుదలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేసేందుకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులు, విధివిధానాలపై మంత్రివర్గం ఒక తుది నిర్ణయానికి రానుంది. ఈ కీలక నిర్ణయాల నేపథ్యంలో నేటి ఏపీ కేబినెట్ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.




