CM Chandrababu: 2027 పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేయడమే లక్ష్యం: కేంద్రమంత్రితో భేటీలో సీఎం చంద్రబాబు

AP CM Chandrababu Meets CR Patil Key Demands on Polavaram Almatti Height and Neradi Barrage

Arun Chilukuri
Published on: 11 May 2026 3:29 PM IST
CM Chandrababu
X

CM Chandrababu: 2027 పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేయడమే లక్ష్యం: కేంద్రమంత్రితో భేటీలో సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు సహా రాష్ట్రంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా పలు కీలక ప్రతిపాదనలతో కూడిన లేఖను ఆయన కేంద్రమంత్రికి సమర్పించారు.

2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేలా కేంద్రం సహకరించాలని సీఎం కోరారు. 2026 ఏప్రిల్ 2 నాటికి కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం విజయవంతంగా పూర్తయిందని, గ్యాప్ 1, 2 పనులు వేగంగా సాగుతున్నాయని వివరించారు. సాగునీటి అవసరాల కోసం కాలువల సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కులకు పెంచినందున, ఆ వ్యయాన్ని కేంద్రం భరించాలని కోరారు. 2011 నుంచి ఉన్న స్టాప్ వర్క్ ఆర్డర్‌ను శాశ్వతంగా ఎత్తివేయాలని విన్నవించారు.

సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఆలమట్టి ఆనకట్ట ఎత్తు పెంచే అంశంపై గెజిట్ విడుదల చేయవద్దని కోరారు. ఎత్తు పెంచితే దిగువన ఉన్న ఏపీ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని హెచ్చరించారు. అప్పర్ కృష్ణా ప్రాజెక్ట్ ఫేజ్-III పనులను నిలిపివేసేలా కర్ణాటకను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం నేరడి బ్యారేజీ పనులు చేపడతామని, భూసేకరణ విషయంలో ఒడిశా సహకరించేలా చూడాలని కోరారు.

పోలవరం-బనకచర్ల లింక్: గోదావరి నుంచి వృథాగా పోయే 200 టీఎంసీల వరద జలాలను రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాలకు మళ్లించేలా ఈ లింక్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. చెరువుల పునరుద్ధరణ: ‘హర్ ఖేత్ కో పానీ’ కింద 297 నీటి వనరుల పునరుద్ధరణ కోసం రూ.285 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చేసిన ఈ విజ్ఞప్తులపై కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ సానుకూలంగా స్పందించారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాధాన్యత కలిగినదిగా గుర్తించి, సకాలంలో పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story