Free Bus: ఆడబిడ్డలకు ఏపీ ప్రభుత్వం బిగ్ సర్ ప్రైజ్.. త్వరలో ఏసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం

Free Bus: ఆంధ్రప్రదేశ్ మహిళలకు కూటమి ప్రభుత్వం మరొక తిరుగులేని శుభవార్త అందించింది.

CR Reddy
Published on: 10 Sept 2026 8:20 AM IST
Free Bus
X

Free Bus

Free Bus: ఆంధ్రప్రదేశ్ మహిళలకు కూటమి ప్రభుత్వం మరొక తిరుగులేని శుభవార్త అందించింది. ఇప్పటివరకు సాధారణ, ఎక్స్‌ప్రెస్ బస్సులకే పరిమితమైన ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని త్వరలోనే ఏసీ బస్సుల్లోనూ వర్తింపజేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మహిళలు చల్లటి ఏసీ బస్సుల్లో గౌరవప్రదంగా ప్రయాణించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మహిళా సాధికారత అనేది కేవలం ప్రసంగాలకే పరిమితం కాకూడదని, చేతల్లో చూపించడమే తమ నైజమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళలు ఉద్యోగాలకు, వ్యాపారాలకు, దైవ దర్శనాలకు లేదా ఇంట్లో సమస్యలు వస్తే పుట్టింటికి కూడా రూపాయి ఖర్చు లేకుండా ఏసీ బస్సుల్లో హాయిగా తిరిగే రోజు రాబోతోందని చెప్పారు. ఇందుకోసం రాష్ట్రంలో భారీ ఎత్తున కొత్త ఏసీ బస్సులను రోడ్లపైకి తీసుకొస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం విజయవంతంగా అమలు అవుతోంది. ఈ సౌకర్యాన్ని దివ్యాంగులకు కూడా అందిస్తున్నారు.

ప్రజా సంక్షేమంలో రికార్డులు సృష్టిస్తున్న కూటమి

రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్ళుగా భావిస్తూ పాలన సాగిస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. ఇచ్చిన ప్రతి సూపర్ సిక్స్ హామీని నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. సంక్షేమం అంటే నేరుగా పేదవాడి చేతికి లబ్ధి చేకూర్చడమేనని గుర్తుచేశారు. ఇప్పటివరకు పెన్షన్ల రూపంలోనే పేదలకు ఏకంగా రూ.73 వేల కోట్లు అందించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని హర్షం వ్యక్తం చేశారు. ప్రతీ నెలా ఒకటో తేదీ ఉదయాన్నే లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ ఇచ్చే అద్భుతమైన వ్యవస్థను పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు.

ఆడబిడ్డల కష్టాలు తీర్చేలా దీపం పథకం

వంటింటి కష్టాల నుంచి ఆడబిడ్డలను గట్టెక్కించేందుకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇచ్చే దీపం పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రతీ ఇంట్లో మహిళల ఆర్థిక భారం గణనీయంగా తగ్గిందని చెప్పారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి నిధులు రాబడుతూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్నామని వివరించారు.

అడ్డంకులు దాటుకుని మెగా డీఎస్సీ నిర్వహణ

యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకొచ్చిన మెగా డీఎస్సీని నిలిపివేయడానికి గత పాలకులు ఏకంగా 350 కేసులు వేసి అడుగడుగునా కుట్రలు పన్నారని సీఎం ఆరోపించారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా కోర్టుల్లో న్యాయపోరాటం చేసి మెగా డీఎస్సీని విజయవంతంగా చేపట్టామని స్పష్టం చేశారు. ఎంతమంది కుట్రలు పన్నినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని ఎవరూ అడ్డుకోలేరని తేల్చి చెప్పారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story