Chandrababu: బాబును నవ్వించిన 'చిట్టి కలెక్టర్' ఆర్నా.. నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ ఏఐ (AI) వీడియో!
Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును 'చిట్టి కలెక్టర్' ఆర్నా క్యూట్ వీడియో అమితంగా ఆకట్టుకుంది.
Chandrababu: రాజకీయ సమావేశాలు, అధికారిక సమీక్షలు, ప్రజా సమస్యల పరిష్కారాలతో నిత్యం అత్యంత బిజీగా ఉండే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... ఈసారి మాత్రం ఓ చిన్నారి క్యూట్ వీడియో చూసి మనసారా నవ్వేశారు. అంతేకాదు... ఆ బుజ్జాయి నటనకు ముగ్ధుడై, ఆ వీడియోను స్వయంగా తన అఫీషియల్ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. సీఎం ప్రశంసలతో ఆ 'చిట్టి కలెక్టర్' ఆర్నా ఒక్కసారిగా ఓవర్‌నైట్ సోషల్ మీడియా స్టార్‌గా మారిపోయింది.
ఈ వైరల్ వీడియో వెనుక ఒక ఫన్నీ బ్యాక్‌డ్రాప్ ఉంది. విక్టరీ వెంకటేశ్ బ్లాక్‌బస్టర్ హిట్ 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలో హీరోయిన్‌ను నమ్మించడానికి ఓ రేంజ్‌లో అబద్ధం చెబుతాడు. తాను వైజాగ్‌కు కలెక్టర్‌గా పనిచేస్తున్నానని.. అప్పట్లో సీఎం చంద్రబాబు నాయుడుతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఉండగా.. బయట తన తండ్రి పడిగాపులు కాస్తున్నాడని తెలిసి మీటింగ్ మధ్యలోనే వచ్చేసినట్లు ఒక ఫన్నీ స్టోరీ అల్లుతాడు.
సరిగ్గా ఇదే సీన్‌ను బేస్ చేసుకుని.. చిన్నారి ఆర్నా తండ్రి ఏఐ (Artificial Intelligence) సాయంతో ఒక అదిరిపోయే వీడియోను క్రియేట్ చేశాడు. వీడియోలో వైజాగ్ జిల్లా కలెక్టర్ సీట్లో దర్జాగా కూర్చున్న ఈ బుజ్జాయి.. సాక్షాత్తూ సీఎంతోనే కాన్ఫరెన్స్‌లో ఉన్నట్లు ఇచ్చిన బిల్డప్, పలికించిన హావభావాలు అంతా ఇంతా కాదు. తాను లోపల మీటింగ్‌లో ఉంటే.. బయట తండ్రి వెయిట్ చేయడంపై వెంకీ డైలాగ్స్‌కు సింక్ చేస్తూ ఆ పాప ఇచ్చిన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ నెక్ట్స్ లెవెల్‌లో పేలాయి.
ఈ చిట్టి కలెక్టర్ ఆర్నా నటనకు ఫిదా అయిపోయిన సీఎం చంద్రబాబు నాయుడు.. "తాను కూడా ఈ చిన్నారికి పెద్ద ఫ్యాన్ అయిపోయాను" అంటూ సరదాగా ట్వీట్ చేశారు.
ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా తనపై వచ్చిన ఒక మీమ్‌ను, సినిమా డైలాగ్‌ను ఇంత సరదాగా, స్పోర్టివ్‌గా తీసుకుని అభినందించడంతో నెటిజన్లు చంద్రబాబుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. "లీడర్ అంటే ఇలా ఉండాలి.. ఎంత ఒత్తిడిలో ఉన్నా ఇంత సానుకూలంగా స్పందించడం గ్రేట్" అంటూ కామెంట్లు పెడుతున్నారు. చంద్రబాబులోని ఈ స్పోర్టివ్ స్పిరిట్‌ను మెచ్చుకుంటూ.. మరికొంతమంది తల్లిదండ్రులు సైతం తమ పిల్లలతో చేసిన ఇలాంటి క్యూట్ వీడియోలను కామెంట్ సెక్షన్‌లో షేర్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.




