Chandrababu: కేంద్ర బృందాలను పంపండి.. తుపాను నష్టంపై అమిత్ షాకు లేఖ రాసిన చంద్రబాబు!

Chandrababu: అర్నబ్ తుపాను నష్టంపై అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ. 70 వేల హెక్టార్లలో వరి పంట నాశనం, కేంద్ర బృందాలను పంపాలని విజ్ఞప్తి.

Arun Chilukuri
Published on: 28 Oct 2026 2:03 PM IST
Chandrababu
X

Chandrababu: కేంద్ర బృందాలను పంపండి.. తుపాను నష్టంపై అమిత్ షాకు లేఖ రాసిన చంద్రబాబు!

Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన 'అర్నబ్‌' (Cyclone Arnab) అతి తీవ్ర తుపాను వల్ల రాష్ట్రంలో సంభవించిన అపార నష్టంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు సుదీర్ఘ లేఖ రాశారు. తుపాను తీవ్రతకు తీవ్రంగా దెబ్బతిన్న పంటలు, ఆస్తుల నష్టాన్ని అంచనా వేసేందుకు వెంటనే కేంద్ర బృందాలను పంపించాలని విజ్ఞప్తి చేశారు.

తుపాను సహాయక చర్యల కోసం 14 ప్రభావిత జిల్లాల్లో 16 ఎన్డీఆర్‌ఎఫ్‌ (NDRF), 11 ఎస్‌డీఆర్‌ఎఫ్‌ (SDRF) బృందాలను రంగంలోకి దించామని తెలిపారు. ప్రమాదకర ప్రాంతాల నుంచి దాదాపు 28,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు తరలించామని వివరించారు.

ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70,900 హెక్టార్లలో వరి పంట నీట మునిగిపోగా, 10,450 హెక్టార్లలో ఉద్యాన పంటలకు భారీగా నష్టం వాటిల్లిందని వెల్లడించారు.

180కి పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని, ప్రధాన రహదారులపై 220కి పైగా చెట్లు కూలిపోయాయని పేర్కొన్నారు. తీర ప్రాంతాల్లో రహదారులు ధ్వంసమై విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్నదని, యుద్ధప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని తెలిపారు.

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో 'అర్నబ్' తుపాను ప్రభావం అత్యధికంగా ఉందని సీఎం స్పష్టం చేశారు.

రాష్ట్ర అత్యవసర ఆపరేషన్స్ కేంద్రం మరియు కంట్రోల్ రూమ్‌లు నిరంతరం పనిచేస్తున్నాయని, సమగ్ర నష్టం అంచనా పూర్తయిన తర్వాత కేంద్రానికి పూర్తిస్థాయి నివేదిక సమర్పిస్తామని తెలిపారు. ఇప్పటివరకు నిరంతరం సహకారం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఎన్డీఆర్‌ఎఫ్ బలగాల సహకారాన్ని ఇలాగే కొనసాగించాలని అభ్యర్థించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.