AP: శస్త్రచికిత్స ముగియగానే విధుల్లోకి పవన్: సీఎం సంచలన వ్యాఖ్యలు!

AP: కోకిలాబెన్ ఆస్పత్రిలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కు కుడి భుజం శస్త్రచికిత్స విజయవంతమైంది. సీఎం చంద్రబాబు నాయుడు ఆయన్ను పరామర్శించి హెల్త్ అప్‌డేట్ ఇచ్చారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 13 July 2026 9:00 PM IST
AP
X

AP: శస్త్రచికిత్స ముగియగానే విధుల్లోకి పవన్: సీఎం సంచలన వ్యాఖ్యలు!

AP: ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు జరిగిన కుడి భుజం శస్త్రచికిత్స విజయవంతమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. శస్త్రచికిత్స అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు నాయుడు, మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్ పరామర్శించారు. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కూడా ఈ సందర్భంగా అక్కడే ఉన్నారు.

పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని ఆయన సతీమణి అన్నా కొణిదలతో పాటు వైద్యులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి, శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. మూడున్నర గంటలపాటు అత్యున్నత వైద్యుల బృందం ఈ ఆపరేషన్ నిర్వహించిందని చెప్పారు. శస్త్రచికిత్స పూర్తయిన వెంటనే విధుల్లోకి రావాలనే ఉత్సాహాన్ని పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారని, అయితే పూర్తి ఆరోగ్యం కోసం తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలని తాను సూచించినట్లు సీఎం వెల్లడించారు.

శస్త్రచికిత్స అనంతరం మూడు వారాలపాటు ఫిజియోథెరపీతో పాటు వైద్యుల పర్యవేక్షణ అవసరమని డాక్టర్లు సూచించినట్లు చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం కుడి భుజం చికిత్సపై దృష్టి పెట్టిన వైద్యులు, ఆరు నెలల తర్వాత ఎడమ భుజాన్ని మరోసారి పరీక్షించి, శస్త్రచికిత్స అవసరమా లేదా ఫిజియోథెరపీతోనే సమస్య పరిష్కారమవుతుందా అన్నది నిర్ణయిస్తారని వివరించారు.

ఏళ్ల తరబడి రెండు భుజాలకు తీవ్రమైన గాయాలు ఉన్నప్పటికీ ప్రజాసేవను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ వాటిని నిర్లక్ష్యం చేశారని సీఎం పేర్కొన్నారు. ప్రజల మధ్య పర్యటనలు, అభిమానుల రద్దీ, తోపులాటలు, చేతులు పట్టుకుని లాగడం వంటి కారణాలతో భుజాల సమస్య మరింత తీవ్రమైందని చెప్పారు. ఇటీవల వైద్య పరీక్షల్లో పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు తేలడంతో కుడి భుజానికి వెంటనే శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారని వెల్లడించారు.

"పవన్ కళ్యాణ్ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను పట్టించుకునే వ్యక్తి కాదు. ప్రజల కోసమే నిరంతరం శ్రమిస్తుంటారు. ఇప్పుడు వైద్యుల సూచనలు పాటించి పూర్తిగా కోలుకోవడం చాలా అవసరం. ఆయన మునుపటి ఉత్సాహంతో, సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వస్తారు" అని చంద్రబాబు నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం స్థిరంగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని సీఎం స్పష్టం చేశారు. పూర్తిస్థాయిలో కోలుకున్న అనంతరం తిరిగి ప్రజాసేవలో అదే ఉత్సాహంతో పాల్గొంటారని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ పరిణామంతో జనసేన శ్రేణులు, అభిమానుల్లో ఊరట నెలకొంది అని మాత్రం చెప్పక తప్పదు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story