Pawan Kalyan: పైలేరియా కేసులపై పవన్ యాక్షన్ ప్లాన్.. అధికారుల ముందే కీలక నిర్ణయం!

Pawan Kalyan: పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో పైలేరియా, హెల్త్ ఎమర్జెన్సీ సమస్యలపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.

Arun Chilukuri
Published on: 6 Jun 2026 12:36 PM IST
Pawan Kalyan: పైలేరియా కేసులపై పవన్ యాక్షన్ ప్లాన్.. అధికారుల ముందే కీలక నిర్ణయం!
X

Pawan Kalyan: పార్వతీపురం మన్యం జిల్లాలోని పెదపెంకి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ఏపీ ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కల్యాణ్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ గ్రామంలో నెలకొన్న తీవ్రమైన ఆరోగ్య, పారిశుద్ధ్య సమస్యలపై అధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపడుతున్న ప్రత్యామ్నాయ మురుగునీటి పారుదల వ్యవస్థ (మ్యాజిక్ డ్రెయిన్లు) పురోగతిని అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు.

పెదపెంకి గ్రామంలో వందకు పైగా పైలేరియా (బోదకాలు) కేసులు నమోదు కావడం, స్థానికులు తరచూ ప్రమాదకరమైన జ్వరాల బారిన పడుతుండటంతో పవన్ కల్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించడమే ఈ వ్యాధులకు మూలకారణమని అధికారులు గుర్తించారు. మురుగునీరు సక్రమంగా వెళ్లే మార్గాలు లేకపోవడం, ప్రధాన కాలువలు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురికావడంతో దోమలు చేరి ఈ హెల్త్ ఎమర్జెన్సీ తలెత్తిందని పవన్ కల్యాణ్‌కు నివేదించారు.

గ్రామంలోని కాలువల అక్రమణలను తొలగించి, కొత్తగా 'మ్యాజిక్ డ్రెయిన్ల' (Magic Drains) నిర్మాణ పనులు చేపట్టినట్లు అధికారులు డిప్యూటీ సీఎంకు తెలిపారు. "మొదట్లో గ్రామస్థుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. కానీ, ఆక్రమణలు తొలగించకపోతే వచ్చే ఆరోగ్య నష్టాలను వారికి వివరించి, ఒప్పించి పనులు ప్రారంభించాం" అని అధికారులు వివరించారు. స్థానికంగా సామాజిక సమస్యలు, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ.. వాటన్నింటినీ అధిగమించి పనులు ముందుకు తీసుకెళ్లిన జిల్లా పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సమీక్ష సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. ఈ నెల 24వ తేదీన (జూన్ 24) తాను స్వయంగా పెదపెంకి గ్రామానికి వస్తున్నట్లు వెల్లడించారు. అక్కడ పూర్తయిన మ్యాజిక్ డ్రెయిన్లతో పాటు, ఇతర గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా ప్రారంభిస్తానని చెప్పారు. పారిశుద్ధ్య లోపంతో బాధపడుతున్న ఉత్తరాంధ్ర గ్రామాలను బాగు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story