ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. కిలో ఉల్లిపాయలు రూ.35, బియ్యం రూ.50

ఏపీలో రైతు బజార్ల ద్వారా ఉల్లిపాయలు కిలో రూ.35, బియ్యం రూ.50కే అందుబాటులోకి రానున్నాయి. ఇతర నిత్యావసరాల ధరల వివరాలు ఇవే.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 Sept 2026 9:23 AM IST
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. కిలో ఉల్లిపాయలు రూ.35, బియ్యం రూ.50
X

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. కిలో ఉల్లిపాయలు రూ.35, బియ్యం రూ.50

ఆంధ్రప్రదేశ్‌లోని సామాన్య ప్రజలకు నిత్యవసర వస్తువుల ధరల భారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు బజార్ల ద్వారా అత్యంత నాణ్యమైన నిత్యావసరాలను అందుబాటు ధరల్లో విక్రయిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గుల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించడమే ధ్యేయంగా ప్రత్యేక కౌంటర్లను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.

దీని ప్రకారం రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో కిలో ఉల్లిపాయలను రూ. 35కే విక్రయిస్తున్నారు. అలాగే బిపిటి (BPT) రకం నాణ్యమైన బియ్యాన్ని కిలో రూ. 50 చొప్పున, చక్కి గోధుమ పిండిని కిలో రూ. 27కే అందిస్తున్నారు. వీటితో పాటు ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా సబ్సిడీ ధరలకే నాణ్యమైన పామాయిల్, బెల్లాన్ని పంపిణీ చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజలకు నిత్యావసరాలు చౌకగా లభించేలా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

మరోవైపు రాష్ట్రంలో ధరల స్థిరీకరణ, నిత్యావసరాల పర్యవేక్షణ, రబీ పంటల ప్రణాళికపై మంత్రుల బృందం వర్చువల్ సమావేశం నిర్వహించింది. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఆరోగ్య మంత్రి సత్య కుమార్ యాదవ్‌లు పాల్గొన్న ఈ భేటీలో.. రైతులకు మద్దతు ధర కల్పించడంపై చర్చించారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పంటలు సాగు చేసేలా సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్