AP Fuel Crisis: ఏపీలో పెట్రోల్ బంకులు బంద్.. ఎక్కడ చూసిన క్యూలైన్లు.!
AP Fuel Crisis: ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం ఇప్పుడు తీవ్ర ఇంధన సంక్షోభానికి దారితీస్తోంది. రాజధాని
Petrol
AP Fuel Crisis: ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం ఇప్పుడు తీవ్ర ఇంధన సంక్షోభానికి దారితీస్తోంది. రాజధాని ప్రాంతమైన ఎన్టీఆర్ జిల్లా మొదలుకొని కోనసీమ వరకు అనేక చోట్ల పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు, ముఖ్యంగా రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంధనం కోసం గంటల తరబడి వేచి చూడటం, చివరకు దొరక్కపోవడంతో నిరాశగా వెనుదిరగడం రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తున్న దృశ్యం.
బకాయిల లొల్లి.. నిలిచిపోయిన సరఫరా
ఈ అకస్మాత్తు కొరతకు ప్రధాన కారణం ఆయిల్ కంపెనీలు , డీలర్ల మధ్య నెలకొన్న ఆర్థిక లావాదేవీల చిక్కేనని తెలుస్తోంది. పెండింగ్‌లో ఉన్న పాత బకాయిలు చెల్లించే వరకు అప్పు ప్రాతిపదికన ఇంధన సరఫరా చేసేది లేదని HPCL, IOCL, BPCL వంటి దిగ్గజ ఆయిల్ కంపెనీలు తెగేసి చెప్పినట్లు సమాచారం. ఈ బకాయిల చెల్లింపుల్లో జాప్యం జరగడంతో సరఫరా గొలుసు (Supply Chain) దెబ్బతిన్నది. దీనికి తోడు పరిశ్రమల్లో వినియోగం తగ్గడం కూడా ప్రభావం చూపింది. ప్రస్తుతం కొండపల్లి పారిశ్రామిక వాడ సమీపంలోని ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద వందల సంఖ్యలో ట్యాంకర్లు నిలిచిపోయి, సరఫరా ఎప్పుడు పునరుద్ధరిస్తారా అని ఎదురుచూస్తున్నాయి.
వరి కోతల వేళ.. కోనసీమ రైతులకు డీజిల్ కష్టాలు
ఇతర రంగాల కంటే వ్యవసాయ రంగంపై ఈ కొరత ప్రభావం అత్యంత దారుణంగా ఉంది. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డీజిల్ కొరత రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. జిల్లాలో ప్రస్తుతం వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆధునిక వ్యవసాయంలో భాగంగా వరి కోత యంత్రాలపై (Harvesters) ఆధారపడుతున్న రైతులకు, ఇప్పుడు వాటిని నడపడానికి అవసరమైన డీజిల్ దొరకడం లేదు. బంకుల వద్ద రైతులు టిన్నులు, డబ్బాలతో బారులు తీరుతున్నారు. వాతావరణం ఎప్పుడు మారుతుందో తెలియని పరిస్థితుల్లో, పంటను కాపాడుకోవాలని తపిస్తున్న రైతులకు ఇంధనం దొరక్కపోవడం పెను శాపంగా మారింది.
ఉమ్మడి జిల్లాల్లో గందరగోళం.. అధికారుల చర్చలు
ఎన్టీఆర్ జిల్లాతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి , ఏలూరు జిల్లాల్లో కూడా ఇంధన సరఫరాకు అంతరాయం కలిగింది. అనేక చోట్ల బంక్ సిబ్బందికి, వాహనదారులకు మధ్య వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ సమస్యపై స్పందించిన సివిల్ సప్లైస్ అధికారులు, ఆయిల్ కంపెనీ ప్రతినిధులు , ఏపీ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ విజయవాడలో అత్యవసర సమావేశం నిర్వహించారు. చర్చలు సఫలమయ్యాయని, సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుందని ఆయిల్ కంపెనీలు హామీ ఇచ్చినట్లు డీలర్స్ అసోసియేషన్ ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు.
రవాణా, పరిశ్రమలపై ప్రభావం
పెట్రోల్, డీజిల్ కొరత కేవలం వాహనదారులకే కాకుండా రవాణా రంగానికి కూడా గొడ్డలి పెట్టులా మారింది. నిత్యావసర వస్తువుల రవాణాపై దీని ప్రభావం పడితే ధరలు పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పారిశ్రామిక అవసరాలకు కూడా డీజిల్ కొరత ఉండటంతో ఉత్పత్తి ప్రక్రియ మందగించే అవకాశం ఉంది. ప్రభుత్వం తక్షణం స్పందించి ఆయిల్ కంపెనీలతో మాట్లాడి, సాధారణ స్థితిని నెలకొల్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.




