AP Governance : ఏపీలో వినూత్న పాలన.. బిజినెస్ రూల్స్ మార్పుకు సీఎం గ్రీన్ సిగ్నల్!
AP Governance : ఏపీలో పాలనానీకానికి సీఎం చంద్రబాబు కొత్త దిశానిర్దేశం చేశారు. పాత బిజినెస్ రూల్స్‌కు స్వస్తి పలికి, టెక్నాలజీతో కూడిన వేగవంతమైన సేవలు అందించేలా కీలక మార్పులకు ఆదేశించారు. ఆర్టిజీఎస్ ఇక కీలకం కానుంది.
CM Chandrababu
AP Governance : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కసరత్తు ప్రారంభించారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న పాత బిజినెస్ రూల్స్ (ప్రభుత్వ పని విధాన నిబంధనలు) ఇకపై చెల్లవని ఆయన స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా, టెక్నాలజీని వాడుకుంటూ ప్రజలకు సేవలను మరింత వేగంగా అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు ఉండబోతున్నాయి. రాజ్యాంగాన్నే అవసరానికి తగ్గట్టు సవరించుకుంటున్నప్పుడు, ప్రజల మేలు కోసం బిజినెస్ రూల్స్ మార్చడంలో తప్పేముందని ఆయన అధికారులను ప్రశ్నించారు.
రొటీన్ పద్ధతులకు ఇక గుడ్ బై
ముఖ్యమంత్రి నిర్వహించిన తాజా సమీక్షలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్లు ఒక టేబుల్ నుంచి మరో టేబుల్‌కు వెళ్లడానికి రోజుల తరబడి పట్టే రొటీన్ పద్ధతులకు ఫుల్ స్టాప్ పెట్టాలని కోరారు. నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యాన్ని తగ్గించి, ప్రతి పనిలో జవాబుదారీతనం పెంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి కార్యాచరణను వెంటనే సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు.
ఆర్టిజీఎస్ చేతికి అన్ని శాఖల పగ్గాలు
రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS)ని ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తోంది. ఇకపై రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల సమాచారం ఆర్టిజీఎస్ విభాగానికి అనుసంధానం కావాలని సీఎం ఆదేశించారు. దీనికోసం ప్రతి శాఖ నుంచి ఒక ప్రత్యేక నోడల్ అధికారిని కేటాయించాల్సి ఉంటుంది. డేటా లేక్ విధానం ద్వారా అన్ని శాఖల డాటాను ఒకే చోట చేర్చి, దాని ఆధారంగా పాలనలో నిర్ణయాలు తీసుకోవాలని బాబు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రజా సంతృప్తే పరమావధి.. టెక్నాలజీయే ఆయుధం!
ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభంగా అందాలన్నదే తన ఉద్దేశమని చంద్రబాబు తెలిపారు. సుమారు 1,200 ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా లేదా ఆన్‌లైన్ ద్వారా అందించే దిశగా అడుగులు వేయాలని చెప్పారు. అధికారుల పనితీరును ఆర్టిజీఎస్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని, ప్రజల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే మార్కులు ఉంటాయని హెచ్చరించారు. అనవసరమైన నిబంధనలను తొలగించి, సామాన్యుడికి ఇబ్బంది లేని పాలనను అందించడమే ఈ బిజినెస్ రూల్స్ మార్పు ప్రధాన ఉద్దేశం.




