AP Govt : పొగాకు రైతులకు చంద్రబాబు సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్
AP Govt : ఆంధ్రప్రదేశ్ పొగాకు రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు భారీ ఉపశమనం ప్రకటించారు.
Tobacco Farmers
AP Govt : ఆంధ్రప్రదేశ్‌లోని పొగాకు రైతులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. పొగాకు పంటకు మార్కెట్‌లో ఆశించిన స్థాయిలో ధరలు దక్కక ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా నిలిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. ధరల స్థిరీకరణ, కొనుగోళ్లకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చే అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రైతులకు తక్షణమే ఆర్థిక ఉపశమనం కలిగించే విధంగా ధరల లోటు భర్తీ పథకం కింద ప్రతి కిలో పొగాకుపై రూ. 20 చొప్పున నేరుగా ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు.
రూ. 188 కోట్ల భారీ సాయం.. కేంద్రం, రాష్ట్రం భాగస్వామ్యం
రైతులను ఆదుకోవడానికి అమలు చేయనున్న ఈ పథకానికి గాను మొత్తం రూ. 188 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. ఈ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భరించేందుకు అంగీకరించాయి. రాష్ట్రంలో ఉన్న మొత్తం 94 మిలియన్ కేజీల పొగాకును రైతుల నుంచి సజావుగా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మార్కెట్‌లో వ్యాపారులు సిండికేట్‌గా మారి ధర తగ్గించకుండా, రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా పూర్తి మద్దతు యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని ఆయన స్పష్టం చేశారు.
గ్రేడ్ల వారీగా కనీస మద్దతు ధరలు ఖరారు
పొగాకు క్వాలిటీని బట్టి రైతులకు మెరుగైన ధర అందేలా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. బ్రైట్ రకం పొగాకుకు కిలోకు రూ. 240, మీడియం రకం పొగాకుకు రూ. 190, లో-గ్రేడ్ పొగాకుకు కనీసం రూ. 110 కంటే తగ్గకుండా వ్యాపారులు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. అంతకంటే తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఉంటాయని, అధికారులు నిరంతరం వేలం కేంద్రాలను పర్యవేక్షించాలని సూచించారు.
కేంద్రంతో నిరంతర సంప్రదింపుల ఫలితం
రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చంద్రబాబు గత కొద్ది రోజులుగా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖతో నిరంతరం చర్చలు జరిపారు. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, డైరెక్టర్లు అమరావతికి వచ్చి ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. సీఎం సూచనలతో కేంద్ర ప్రతినిధులు రాష్ట్రంలోని ప్రముఖ పొగాకు కొనుగోలుదారులు, ఎగుమతిదారులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని రైతులకు మేలు జరిగేలా ఈ తుది నిర్ణయాన్ని ఖరారు చేశారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు పలువురు ఉన్నతాధికారులు, టొబాకో బోర్డు ప్రతినిధులు పాల్గొన్నారు.




