Andhra: ఏపీలో స్కూల్ మారాలనుకునే విద్యార్ధులకు ఎగిరిగంతేసే వార్త.. ఇది కదా కావాల్సింది

Andhra: ఆంధ్రప్రదేశ్‌లో ఒక స్కూల్ నుంచి మరో స్కూల్‌కు బదిలీ అయ్యే విద్యార్థుల కోసం ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమలులోకి తెచ్చింది.

Ravi
By Ravi
Published on: 25 May 2026 5:40 PM IST
Andhra
X

Andhra: ఏపీలో స్కూల్ మారాలనుకునే విద్యార్ధులకు ఎగిరిగంతేసే వార్త.. ఇది కదా కావాల్సింది

Andhra: పిల్లలను ఒక స్కూల్ నుంచి మరో స్కూల్‌కు మార్చడం అనేది తల్లిదండ్రులకు పెద్ద తలనొప్పితో కూడిన పనిలాంటిదని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫీజుల బకాయిల పేరుతో టీసీ, లేదా రికార్డు షీట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ, ఏపీ ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల బదిలీ ప్రక్రియను సులభతరం చేయడానికి ఒక కీలక సంస్కరణను తీసుకొచ్చింది. దీని కోసం కొత్తగా "స్టూడెంట్‌ రిలీవ్‌ రిక్వెస్ట్‌ మేనేజ్‌మెంట్‌" విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

సాధారణంగా ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులు వేరే స్కూల్‌లో చేరాలంటే పాత బకాయిలు మొత్తం ఒకేసారి కట్టాలని మేనేజ్‌మెంట్లు పట్టుబడుతుంటాయి. ఈ ఇబ్బందులను గమనించిన ఏపీ విద్యాశాఖ సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇకపై పాత స్కూల్ ఫీజు బకాయిలు ఉంటే.. కేవలం 50 శాతం ఫీజును వెంటనే చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన 50 శాతం మొత్తాన్ని ఆరు సమాన వాయిదాల్లో స్కూల్‌కు చెల్లించేందుకు ప్రభుత్వం తల్లిదండ్రులకు వెసులుబాటు కల్పించింది.

విద్యార్థి ప్రస్తుతం చదువుతున్న స్కూల్ నుంచి బదిలీ కావాలనుకుంటే.. ఎస్‌ఆర్‌ఆర్‌ఎం పేరిట విద్యార్థిని రిలీవ్ చేయాలని కోరుతూ ఒక రిక్వెస్ట్‌తో పాటు, తల్లిదండ్రుల డిక్లరేషన్‌ పత్రాన్ని ప్రస్తుత స్కూల్‌లో అందజేయాల్సి ఉంటుంది. ఈ వివరాలను పరిశీలించిన వెంటనే పాఠశాల యాజమాన్యం టీసీ లేదా రికార్డు షీట్‌ను జారీ చేయాలి. ఆ తర్వాత సదరు విద్యార్థి పేరును డ్రాప్‌బాక్స్‌లో నమోదు చేస్తారు. వేరే పాఠశాలలో చేరిన వెంటనే 'యూడైస్ ప్లస్' యాప్‌లో విద్యార్థి పేరును చేర్చుకోవచ్చు.

ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త బదిలీ విధానం వల్ల ప్రైవేట్ పాఠశాలల వేధింపుల నుంచి తల్లిదండ్రులకు పెద్ద ఉపశమనం లభించినట్లయింది. అంతేకాకుండా, ఈ బదిలీ ప్రక్రియ కారణంగా ప్రభుత్వ స్కూళ్లలో కూడా అడ్మిషన్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, కొత్త స్కూల్ హెడ్‌మాస్టర్లు లేదా అధికారులు విద్యార్థుల పేర్లను డ్రాప్‌బాక్స్ నుంచి సకాలంలో అప్‌డేట్ చేయడంలో అజాగ్రత్తగా ఉండకూడదని ప్రభుత్వం సూచించింది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story