AP Govt : ఏపీ వాహనదారులకు గుడ్ న్యూస్.. 24 గంటల్లోనే వెహికల్ రిజిస్ట్రేషన్ పూర్తి

AP Govt : వాహనం కొన్న తర్వాత నంబర్ ప్లేట్ కోసం ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ తిరగడం, రోజుల తరబడి ఎదురుచూడటం వంటి కష్టాలకు చెక్ పెడుతూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

CR Reddy
Published on: 8 May 2026 8:18 AM IST
Vehicle Registration
X

Vehicle Registration

AP Govt : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త వాహనం కొన్నవారికి ఇక రిజిస్ట్రేషన్ టెన్షన్లు తీరనున్నాయి. వాహనం కొన్న తర్వాత నంబర్ ప్లేట్ కోసం ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ తిరగడం, రోజుల తరబడి ఎదురుచూడటం వంటి కష్టాలకు చెక్ పెడుతూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖలో పారదర్శకతను పెంచడంతో పాటు సేవలను వేగవంతం చేసేందుకు సరికొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా వాహనాలు కొనుగోలు చేసే వారికి గతంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఒక పెద్ద ప్రహసనంలా ఉండేది. షోరూమ్ డీలర్లు తాత్కాలిక రిజిస్ట్రేషన్ (TR) చేసిన తర్వాత, శాశ్వత రిజిస్ట్రేషన్ (PR) కోసం పంపిన ఫైళ్లు ఆర్టీఓ కార్యాలయాల్లో వారాల తరబడి పెండింగ్‌లో ఉండేవి. నిర్ణీత గడువు లేకపోవడంతో అధికారులు తమకు వీలైనప్పుడు ఆమోదం తెలిపేవారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 27 వేల దరఖాస్తులు పెండింగ్‌లో పడిపోయాయని రవాణా శాఖ గుర్తించింది. ఈ జాప్యాన్ని నివారించి, వాహనదారులకు ఊరట కలిగించేందుకు ప్రభుత్వం ఇప్పుడు కఠినమైన నిబంధనలను తీసుకువచ్చింది.

24 గంటలే డెడ్ లైన్

ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం.. ఫ్యాన్సీ నంబర్లు కోరుకునే వారు మినహా, సాధారణ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 24 గంటల్లోనే ప్రక్రియ పూర్తి కావాలి. డీలర్ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసిన 24 గంటల లోపు సంబంధిత అధికారి దానిని పరిశీలించి ఆమోదించాలి. ఒకవేళ నిర్ణీత గడువులోగా అధికారులు ఎటువంటి స్పందన తెలపకపోతే, ఆ దరఖాస్తు ఆటోమేటిక్‌గా ఆమోదం పొందినట్లుగా పరిగణించే విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. దీనివల్ల సిబ్బంది నిర్లక్ష్యం వహించినా సామాన్యుడికి మాత్రం పని ఆగిపోదు.

సెలవుల్లోనూ పని.. ఇంటి నుంచే అనుమతులు

రిజిస్ట్రేషన్ ఫైళ్లు పేరుకుపోవడానికి సెలవు రోజులు కూడా ఒక కారణమని భావించిన రవాణా శాఖ, అధికారులకు కీలక సూచనలు చేసింది. ఆదివారాలు లేదా ఇతర ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా అధికారులు ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి అనుమతులు మంజూరు చేయాలని స్పష్టం చేసింది. తద్వారా సోమవారం నాటికి భారీగా దరఖాస్తులు పోగుపడకుండా చూసుకోవాలని ఆదేశించింది. అధికారులకు ఎక్కడి నుంచైనా లాగిన్ అయ్యే సౌకర్యం ఉన్నందున, ప్రక్రియను వేగవంతం చేయడంలో ఎటువంటి సాకులు చెప్పడానికి వీల్లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.

డీలర్లు, యజమానులకు భారీ ఊరట

ఈ కొత్త విధానం వల్ల వాహన షోరూమ్ డీలర్లకు కూడా పెద్ద ఊరట లభించనుంది. రిజిస్ట్రేషన్ ఆలస్యమైతే వాహనాల డెలివరీలో సమస్యలు తలెత్తుతుంటాయి, ఇప్పుడు 24 గంటల్లోనే అనుమతులు వస్తుండటంతో కస్టమర్లకు త్వరగా బండ్లు అప్పగించే వీలుంటుంది. మరోవైపు కొత్త బండి కొన్నవారు నంబర్ ప్లేట్ కోసం ఆర్టీఓ ఆఫీసు చుట్టూ తిరిగే అవసరం లేకుండా, సులభంగా తమ వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ నంబర్లను పొందవచ్చు. పారదర్శకతను పెంచి అవినీతికి తావులేకుండా చేయడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు లక్ష్యమని రవాణా శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story