AP Govt: వారికి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. అంకౌట్లలో రూ.25,000 జమ
AP Govt: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌లో చేనేత కార్మికుల కోసం 'నేతన్నకు భరోసా' పథకం ప్రకటించిన కూటమి ప్రభుత్వం.
AP Govt: వారికి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. అంకౌట్లలో రూ.25,000 జమ
Netannaku Bharosa: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికుల ఇళ్లలో జాతీయ చేనేత దినోత్సవం వేళ సరికొత్త వెలుగులు నిండనున్నాయి. మగ్గం నడిపే నేతన్నల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘నేతన్నకు భరోసా’ పథకాన్ని అమలు చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. చేనేత, జౌళి శాఖ ఇప్పటికే ఇందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్‌ను వేగవంతం చేసింది.
గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అమలైన ‘నేతన్న నేస్తం’ పథకం కింద అర్హులైన చేనేత కార్మికులకు ఏడాదికి రూ. 24,000 చొప్పున లబ్ధి చేకూర్చేవారు. అయితే, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నేతన్నల కష్టాలను గుర్తించి, ఈ ఆర్థిక సహాయాన్ని మరింత పెంచాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మరో రూ. 1,000 అదనంగా జోడించి.. ఏడాదికి రూ. 25,000 చొప్పున కార్మికుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మెగా స్కీమ్ విజయవంతంగా అమలు చేయడం కోసం ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో ఏకంగా రూ. 250 కోట్లను కేటాయించడం విశేషం.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 55,000 మంది చేనేత కార్మికులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారని ప్రభుత్వం ఒక ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఈ పథకానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలు.. సొంతంగా చేనేత మగ్గం కలిగి ఉండి, దానిపైనే జీవనాధారం సాగిస్తున్న కార్మికులకు ఈ పథకం వర్తిస్తుంది. నిబంధనల ప్రకారం ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ రూ. 25,000 ఆర్థిక సహాయం అందుతుంది.
కేవలం మగ్గం నేసేవారికే కాకుండా.. చేనేత రంగానికి వెన్నుముకగా నిలిచే రాట్నం వడకడం, నూలుకు రంగులు అద్దడం లాంటి పనులు చేసే కార్మికులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి అనుబంధ రంగాలకు చెందిన వారు రాష్ట్రంలో దాదాపు 10,000 మంది వరకు ఉంటారని అధికారులు గుర్తించారు.
కేవలం మగ్గం ఉన్నవారికే కాకుండా రంగులు అద్దే, రాట్నం వడకే కార్మికులను కూడా చేర్చడం ద్వారా నిజమైన నేతన్నలందరికీ న్యాయం జరుగుతుందని చేనేత వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఆగస్టు 7వ తేదీన నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకే ఈ నగదు బదిలీ కానుంది.




