AP High Court : కారుణ్య నియామకాలపై సంచలన తీర్పు.. నిరుద్యోగుల ఆశలకు ఊపిరి పోసిన హైకోర్టు
AP High Court : ఏపీలో కారుణ్య నియామకాలపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. కొత్త మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించింది. ఆర్థికంగా బలంగా ఉంటే ఉద్యోగం కాకుండా ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని స్పష్టం చేసింది.
AP High Court
AP High Court : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కారుణ్య నియామకాల విషయంలో నెలకొన్న గందరగోళానికి తెర దించుతూ ఏపీ హైకోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. ప్రభుత్వ ఉద్యోగం అనేది అర్హత ఉన్న ప్రతి ఒక్కరి హక్కు అని, కేవలం వారసత్వంగా వచ్చే ఆస్తి కాదని కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన నియామకాల్లో కారుణ్య కోటా కింద భారీగా ఉద్యోగాలు ఇవ్వడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇకపై ఈ నియామకాలకు కొత్త రూల్స్ తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి వివిధ ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లలో ఏకంగా 20,801 కారుణ్య నియామకాలు జరగడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. సాధారణంగా నోటిఫికేషన్ల ద్వారా వచ్చే ఉద్యోగాల కంటే ఇవే ఎక్కువగా ఉండటం వల్ల ఏళ్ల తరబడి కష్టపడి చదువుకుంటున్న నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతోందని కోర్టు అభిప్రాయపడింది. కొంతమంది ఒకే కుటుంబం నుంచి మూడో తరానికి కూడా ఈ కోటా కింద ఉద్యోగాలు పొందడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఇది రాజ్యాంగం కల్పించిన సమాన అవకాశాల హక్కుకు విరుద్ధమని స్పష్టం చేసింది.
ఉద్యోగం పొందే ఉద్దేశంతో దూరపు బంధువులైన సోదరులు, అక్కాచెల్లెళ్లు, మేనల్లుళ్లు, మేనకోడళ్లు కూడా తాము మరణించిన ఉద్యోగిపై ఆధారపడి జీవిస్తున్నామని క్లెయిమ్ చేస్తున్నారని కోర్టు గుర్తించింది. ఇకపై కేవలం భార్య, కుమారుడు, కుమార్తె, తల్లిదండ్రులను మాత్రమే ఈ పరిధిలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా, సదరు కుటుంబం ఆర్థికంగా బలంగా ఉంటే వారికి ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదని, కేవలం ప్రభుత్వం నిర్ణయించిన ప్రమాణాల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికే ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించింది.
మరణించిన ఉద్యోగి కుటుంబం ఆర్థికంగా నిలకడగా ఉన్నట్లయితే, వారికి రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని హైకోర్టు సూచించింది. మరణించిన ఉద్యోగికి ఉన్న సర్వీసు కాలం, ఆయన చివరి జీతం ఆధారంగా ఈ పరిహారాన్ని లెక్కించాలని చెప్పింది. ఒకవేళ ఉద్యోగం ఇవ్వడం తప్పనిసరైతే, అది శాశ్వత ప్రాతిపదికన కాకుండా అవుట్‌సోర్సింగ్ లేదా తాత్కాలిక పద్ధతిలో ఉండాలని పేర్కొంది. అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలని, అది పూర్తిగా ప్రభుత్వం తన విచక్షణతో చేయాలని తెలిపింది.
సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన వివిధ తీర్పులను దృష్టిలో ఉంచుకుని, కారుణ్య నియామకాలపై సమగ్రమైన మరియు పారదర్శకమైన కొత్త మార్గదర్శకాలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ ప్రక్రియను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని గడువు విధించింది. అర్హత ఉన్న నిరుద్యోగుల ఆశలను దెబ్బతీయకుండా, నిజంగా ఆపదలో ఉన్న ఉద్యోగి కుటుంబానికి మేలు జరిగేలా ఈ నిబంధనలు ఉండాలని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో రాష్ట్రంలోని వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగ అభ్యర్థులకు ఊరట లభించినట్లయింది.




