Nara Lokesh: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తో మంత్రి నారా లోకేశ్ భేటీ.. ఐటీ సంస్కరణలపై చర్చ!

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ముంబయి పర్యటనలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో పాటు హైపర్‌ స్కేల్‌ డేటా సంస్థ ‘ఎయిర్‌ ట్రంక్‌’ సీఈవో రాబిన్‌ ఖుదాతో విడివిడిగా భేటీ అయ్యారు.

Arun Chilukuri
Published on: 1 Jun 2026 3:53 PM IST
Nara Lokesh
X

Nara Lokesh: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తో మంత్రి నారా లోకేశ్ భేటీ.. ఐటీ సంస్కరణలపై చర్చ!

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ముంబయి పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన పలువురు రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి లోకేశ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో (CM Devendra Fadnavis) ముంబయిలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్‌కు సీఎం దేవేంద్ర ఫడణవీస్ సాదర స్వాగతం పలికారు. మంత్రి లోకేశ్ ఆయనకు మంగళగిరి చేనేత శాలువా కప్పి, తిరుమల శ్రీవారి ప్రతిమను అందజేశారు. ప్రతిగా మహారాష్ట్ర సీఎం కూడా లోకేశ్‌కు గణేశ్‌ ప్రతిమను బహూకరించారు.

ఈ భేటీలో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్న పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతితో పాటు రాష్ట్రంలో అమలు చేస్తున్న 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానాలను మహారాష్ట్ర సీఎంకు లోకేశ్ వివరించారు. ఏపీ విద్యా శాఖలో తాము తీసుకువచ్చిన ఆధునిక సంస్కరణలు, స్కిల్ డెవలప్‌మెంట్‌ విధానాలను తెలియజేశారు. అదే సమయంలో మహారాష్ట్ర ఐటీ, విద్యా శాఖల్లో అమలవుతున్న అత్యుత్తమ విధానాలను సీఎంను అడిగి తెలుసుకున్నారు.

మహారాష్ట్ర సీఎంతో భేటీకి అంతకుముందు.. మంత్రి నారా లోకేశ్ అంతర్జాతీయంగా పలు దేశాల్లో డేటా సెంటర్లు నిర్వహిస్తున్న ప్రముఖ హైపర్‌ స్కేల్‌ డేటా సంస్థ ‘ఎయిర్‌ ట్రంక్‌’ (AirTrunk) సీఈవో రాబిన్‌ ఖుదాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విశాఖపట్నం (వైజాగ్) వేగంగా ఐటీ, ఏఐ హబ్‌గా ఎదుగుతోందని లోకేశ్ ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. "వైజాగ్ నగరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా హైపర్‌స్కేల్‌ హబ్‌గా ఆవిర్భవిస్తోంది. ఇప్పటికే గూగుల్‌ ఏఐ హబ్‌, రిలయన్స్ ఏఐ డేటా సెంటర్ల పనులు అక్కడ శరవేగంగా పురోగతిలో ఉన్నాయి. డేటా సెంటర్ల ఏర్పాటుకు విశాఖపట్నం అన్నివిధాలా అనుకూలమైన ప్రాంతం. కాబట్టి ‘ఎయిర్ ట్రంక్’ తన సరికొత్త క్యాంపస్‌ను వైజాగ్‌లో ఏర్పాటు చేయాలి" అని లోకేశ్ కోరారు.

మంత్రి లోకేశ్ ప్రెజెంటేషన్ మరియు ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై ఎయిర్ ట్రంక్ సీఈవో రాబిన్ ఖుదా సానుకూలంగా స్పందించారు. వైజాగ్‌లో డేటా సెంటర్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను తాము ఖచ్చితంగా పరిశీలిస్తామని మంత్రికి హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ రంగానికి ఊపు తెచ్చేలా లోకేశ్ జరుపుతున్న ఈ పర్యటనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story