Andhra Pradesh: బీసీలకు 34% రిజర్వేషన్లతో రాజకీయ సాధికారత!

Andhra Pradesh: స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ల పునరుద్ధరణ హర్షణీయమని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. పూర్తి వివరాలకు చూడండి.

Hari Kishan  AP Bureau Chief
Updated on: 19 Aug 2026 1:27 PM IST
Andhra Pradesh
X

Andhra Pradesh: బీసీలకు 34% రిజర్వేషన్లతో రాజకీయ సాధికారత!

Andhra Pradesh: బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హర్షం వ్యక్తం చేశారు. బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించి, వారికి అసలైన స్వాతంత్రాన్ని అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు.

బీసీల రాజకీయ, సామాజిక, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. బీసీల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే కట్టుబడి ఉందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పటేల్, పట్వారి, కరణం, మునసబు వంటి వ్యవస్థలను రద్దు చేసి సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టిన ఘనత దివంగత ఎన్టీఆర్‌దేనని గుర్తు చేశారు.

వెనుకబడిన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో ఎన్టీఆర్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. స్థానిక సంస్థల్లో బీసీలకు తొలిసారిగా 20 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

అనంతరం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బీసీల రిజర్వేషన్లను 34 శాతానికి పెంచి, స్థానిక సంస్థల్లో వారికి మరింత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించారని తెలిపారు. దీని ద్వారా వేలాది మంది బీసీ వర్గాల ప్రజలు ప్రజాప్రతినిధులుగా ఎదిగే అవకాశం లభించిందన్నారు.

అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్ల విషయంలో కుట్రపూరితంగా వ్యవహరించిందని మంత్రి ఆరోపించారు. 34 శాతంగా అమలవుతున్న రిజర్వేషన్లను 24 శాతానికి కుదించడం ద్వారా దాదాపు 16,800 మంది బీసీలకు రాజకీయ అవకాశాలు దూరం చేశారని విమర్శించారు.

బీసీలకు జరుగుతున్న అన్యాయంపై తెలుగుదేశం పార్టీ నిరంతరం పోరాటం చేసిందని తెలిపారు. టీడీపీలో బీసీలను అణచివేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు పాల్పడిందని కొల్లు రవీంద్ర ఆరోపించారు.

అయినప్పటికీ బీసీలు వెనక్కి తగ్గకుండా తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారని అన్నారు. బీసీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి తెలిపారు.

బీసీలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేలా అనేక చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ల పునరుద్ధరణతో బీసీలకు మరింత రాజకీయ ప్రాతినిధ్యం లభిస్తుందని చెప్పారు.

భవిష్యత్తులో బీసీ రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. బీసీల హక్కులను కాపాడుతూ వారికి న్యాయం చేయడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని, సామాజిక న్యాయం సాధించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు....

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story