AP: 92 మున్సిపాలిటీల్లో 88 చోట్ల గెలుపు.. వైసీపీకి పెమ్మసాని సూటి ప్రశ్న.!

AP: స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. 92 మున్సిపాలిటీల్లో 88 చోట్ల ఎన్డీయే కూటమి విజయం సాధించడంపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించారు.

G Krishna
Published on: 3 Nov 2026 7:44 PM IST
AP
X

AP: 92 మున్సిపాలిటీల్లో 88 చోట్ల గెలుపు.. వైసీపీకి పెమ్మసాని సూటి ప్రశ్న.!

AP: స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. 92 మున్సిపాలిటీల్లో 88 చోట్ల ఎన్డీయే కూటమి విజయం సాధించడంపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించారు. ఈ ఫలితాలు వైఎస్సార్‌సీపీ పాలనపై ప్రజలు ఇచ్చిన తీర్పని, కూటమి ప్రభుత్వంపై తమకున్న నమ్మకాన్ని ఓట్ల రూపంలో చాటారని అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఎన్నికల ఫలితాలతో పాటు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు.

గత రెండున్నరేళ్లలో కూటమి ప్రభుత్వం ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిందని పెమ్మసాని తెలిపారు. అన్న క్యాంటీన్లు, వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు, తల్లికి వందనం, దీపం, అన్నదాత సుఖీభవ వంటి పథకాల ద్వారా సుమారు రూ.1.50 లక్షల కోట్ల సంక్షేమ ప్రయోజనాలను అందించామని చెప్పారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు మెగా డీఎస్సీ, రాయలసీమ రైజింగ్ కార్యక్రమాల ద్వారా అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టామని వివరించారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రత్యర్థులను బెదిరించి నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని పెమ్మసాని ఆరోపించారు. అప్పట్లో సుమారు 50 వేల స్థానాలను బలవంతంగా ఏకగ్రీవం చేసుకున్నారని విమర్శించారు. ప్రస్తుతం స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగాయని, 92 మున్సిపాలిటీల్లో 88 చోట్ల కూటమి విజయం సాధించిందని వెల్లడించారు.

ఓటమి వచ్చినప్పుడల్లా ఈవీఎంలపై నెపం వేయడం వైఎస్సార్‌సీపీకి అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు. బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నికల్లోనూ ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని అన్నారు.

గతంలో నిలిచిపోయిన 92 కేంద్ర ప్రభుత్వ పథకాలను తిరిగి ప్రారంభించామని పెమ్మసాని తెలిపారు. కేంద్ర సహకారంతో మూడు లక్షల గ్రామీణ ఇళ్ల నిర్మాణం, జల్ జీవన్ మిషన్ పనులు చేపట్టామన్నారు. పోలవరంతో పాటు 36 ప్రాజెక్టులకు రూ.35 వేల కోట్లతో పనులు వేగవంతం చేశామని చెప్పారు. రాబోయే రెండున్నరేళ్లలో ఏపీని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.