AP Municipal Elections 2026: ఏపీ స్థానిక పోరులో బిగ్ ట్విస్ట్.. వాయిదా పడనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్..?
AP Municipal Elections 2026: సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ తేదీలు మారనున్నాయి.
AP Municipal Elections 2026: ఏపీ స్థానిక పోరులో బిగ్ ట్విస్ట్.. వాయిదా పడనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్..?
AP Municipal Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల (మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలు) ఎన్నికల ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అభ్యర్థుల తుది జాబితా ప్రకటనను ఈ నెల 25 వరకు వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (SEC) సుప్రీంకోర్టు ఆదేశించడంతో పోలింగ్ తేదీలు మారడం ఖాయమైంది. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో మున్సిపల్ పోలింగ్ మూడు నుండి నాలుగు రోజులు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.
తొలి షెడ్యూల్ ప్రకారం బుధవారమే అభ్యర్థుల తుది జాబితా విడుదల చేసి, అక్టోబర్ 28న పోలింగ్, 29న రీపోలింగ్ మరియు 30న ఓట్ల లెక్కింపు చేపట్టాల్సి ఉంది. కానీ సుప్రీంకోర్టు ఆదేశాల దృష్ట్యా అభ్యర్థుల తుది జాబితా ప్రకటన అక్టోబర్ 25కు వాయిదా పడటంతో, కొత్త తేదీలను ఖరారు చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.
మరోవైపు నవంబరు 3న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్, 4న రీపోలింగ్, 5న ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. పోలీసు యంత్రాంగం మరియు ఎన్నికల సిబ్బంది ఈ విధుల్లో నిమగ్నమై ఉంటారు. బందోబస్తు నిర్వహణ దృష్ట్యా, ఎంపీటీసీ-జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక లేదా తగిన విరామ సమయంతో పురపాలక పోలింగ్ నిర్వహించేలా కొత్త తేదీలను ప్రకటిస్తారని సమాచారం.
నామినేషన్ల వేళ ఆటంకాలు ఎదురయ్యాయని విపక్ష వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. అందిన ఫిర్యాదులు, ఎలక్ట్రానిక్ ఆధారాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఎస్‌ఈసీకి సూచించింది. స్థానికంగా రాతపూర్వకంగా నమోదైన ఫిర్యాదుల సంఖ్య తక్కువగానే ఉండవచ్చని భావిస్తుండగా, గురువారం నాటికి దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మళ్లీ నామినేషన్లకు గడువు ఇచ్చినప్పటికీ, అది అతికొద్ది స్థానాలకే పరిమితం కావచ్చని తెలుస్తోంది.
ఈ వాయిదాతో అభ్యర్థులకు క్షేత్రస్థాయిలో ప్రచారం చేసుకునేందుకు అదనపు సమయం లభించనుంది. అంతేకాకుండా, అధికార కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాట్లు, అసమ్మతి నేతలు మరియు తిరుగుబాటు అభ్యర్థుల బుజ్జగింపులకు తగిన వెసులుబాటు లభించినట్లయింది.




