డబుల్ ఇంజిన్ సర్కార్... డబుల్, త్రిబుల్ సంక్షేమం,రెండేళ్లలో సంక్షేమానికి కొత్త నిర్వచనం ఇచ్చిన కూటమి ప్రభుత్వం..

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సామాజిక పెన్షన్లు, అన్న క్యాంటీన్లు, స్త్రీ శక్తి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల ప్రగతిపై ప్రత్యేక కథనం.

Hari Kishan  AP Bureau Chief
Published on: 8 Jun 2026 7:56 PM IST
Chandrababu
X

డబుల్ ఇంజిన్ సర్కార్... డబుల్, త్రిబుల్ సంక్షేమం,రెండేళ్లలో సంక్షేమానికి కొత్త నిర్వచనం ఇచ్చిన కూటమి ప్రభుత్వం..

Chandrababu Naidu: రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో ఆర్థిక సవాళ్లు ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్‌లో 2024లో ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఈ రెండేళ్ల కాలంలో అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాల సృష్టితో పాటు సంక్షేమాన్ని సమాంతరంగా నడిపించడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా నిలిచింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఒకవైపు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంతో పాటు మరోవైపు సంక్షేమ పథకాల అమలులో కూడా రికార్డులు సృష్టించిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వాల మాదిరిగా కొన్ని వర్గాలకే పరిమితమైన పథకాల కంటే సమాజంలోని అన్ని వర్గాలను స్పృశించే విధంగా సంక్షేమ కార్యక్రమాలను రూపొందించడం ఈ ప్రభుత్వ ప్రత్యేకతగా మారింది.

*పెన్షన్లలో దేశానికే ఆదర్శంగా ఏపీ*

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకున్న కీలక నిర్ణయాల్లో సామాజిక భద్రతా పెన్షన్ల పెంపు ప్రధానమైనది. ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ మొత్తాన్ని రూ.4 వేలుకు పెంచడం ద్వారా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర బలహీన వర్గాలకు పెద్ద ఊరట కల్పించింది. ఇప్పటివరకు రూ.65 వేల కోట్లకు పైగా పెన్షన్ల రూపంలో పంపిణీ చేయడం దేశంలోనే అరుదైన రికార్డుగా నిలిచింది. ప్రతి నెలా గ్రామ సచివాలయాల సిబ్బంది ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు అందించడం ద్వారా లబ్ధిదారులకు ఇబ్బందులు తగ్గాయి. పెన్షన్ రోజును పండుగలా మార్చిన ప్రభుత్వం అనే గుర్తింపు కూడా ఈ కార్యక్రమం ద్వారా వచ్చింది.

*అన్న క్యాంటీన్లు... ఆకలి బాధకు శాశ్వత పరిష్కారం*

పేదలు, కార్మికులు, ఆటో డ్రైవర్లు, వలస కార్మికులు, ఉద్యోగార్థులు వంటి వర్గాలకు అన్న క్యాంటీన్లు గొప్ప వరంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా 269 క్యాంటీన్ల ద్వారా కోట్లాది భోజనాలు అందించడం జరిగింది. రోజుకు తక్కువ ఖర్చుతో అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం లభించడంతో వేలాది కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో జీవన వ్యయం పెరిగిన నేపథ్యంలో అన్న క్యాంటీన్లు సామాజిక భద్రతకు కొత్త రూపంగా నిలిచాయి.

*స్త్రీ శక్తి... మహిళల ప్రయాణానికి స్వేచ్ఛ*

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన స్త్రీ శక్తి పథకం అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమంగా మారింది. ఉద్యోగినులు, విద్యార్థినులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, రైతు కుటుంబాలకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున ఈ పథకాన్ని వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు 71 కోట్లకు పైగా ప్రయాణాలు నమోదవడం ఈ పథకం విజయాన్ని ప్రతిబింబిస్తోంది. కుటుంబ వ్యయంలో రవాణా ఖర్చు తగ్గడం ద్వారా మహిళల పొదుపు సామర్థ్యం కూడా పెరిగింది.

*తల్లికి వందనం... విద్యా రంగంలో చారిత్రక నిర్ణయం*

ప్రతి విద్యార్థికి రూ.15 వేల చొప్పున తల్లి ఖాతాలో జమ చేసే తల్లికి వందనం పథకం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 67 లక్షలకు పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరగా, దాదాపు రూ.10,090 కోట్లు ఒకేసారి విడుదల చేయడం సంక్షేమ చరిత్రలో ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. విద్యార్థుల డ్రాప్‌ఔట్ రేటును తగ్గించడం, పేద కుటుంబాలకు విద్యా ఖర్చుల భారం తగ్గించడం, తల్లుల ఆర్థిక సాధికారత పెంచడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి.

*రైతు సంక్షేమానికి భారీ ప్రాధాన్యం*

అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయాన్ని కలిపి ఏడాదికి రూ.20 వేల వరకు అందిస్తున్నారు. 46 లక్షల మంది రైతులకు ఇప్పటికే వేల కోట్ల రూపాయలు జమయ్యాయి. దీనికి తోడు డ్రిప్ ఇరిగేషన్, వ్యవసాయ యాంత్రీకరణ, విత్తనాలు, ఎరువులపై సబ్సిడీలు, మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా ధరల స్థిరీకరణ వంటి చర్యలు రైతులకు భరోసా కల్పిస్తున్నాయి. ధాన్యం కొనుగోలులో 24 గంటల్లో చెల్లింపులు చేయడం కూడా రైతులకు పెద్ద ఉపశమనం ఇచ్చింది.

*ఉచిత గ్యాస్‌తో మహిళలకు ఊరట*

దీపం-2.0 పథకం కింద సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ మహిళలపై గృహ వ్యయ భారం తగ్గిస్తోంది. ఇప్పటికే 4.26 కోట్ల సిలిండర్లు పంపిణీ కావడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం ఎంతగా చేరువైందో అర్థమవుతోంది. వంటగ్యాస్ ధరలు పెరుగుతున్న సమయంలో ఈ సాయం మహిళలకు ప్రత్యక్ష ఆర్థిక ప్రయోజనం అందిస్తోంది.

*బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రత్యేక ప్రాధాన్యం*

సామాజిక న్యాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం వివిధ వర్గాల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు, స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్, ఎస్సీ వర్గీకరణ అమలు, మైనారిటీ సంక్షేమానికి వేల కోట్ల బడ్జెట్ కేటాయింపు, వక్ఫ్ బోర్డు పునరుద్ధరణ వంటి నిర్ణయాలు తీసుకుంది. పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజన్లు, పురోహితులు, నాయీ బ్రాహ్మణులకు గౌరవ వేతనాల పెంపు ద్వారా సంప్రదాయ వృత్తుల పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.

*దివ్యాంగులు, ఆటో డ్రైవర్లు, మత్స్యకారులకు భరోసా*

దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం, ఆటో డ్రైవర్లకు వార్షిక ఆర్థిక సాయం, మత్స్యకారులకు ప్రత్యేక నగదు ప్రోత్సాహకాలు అందించబడ్డాయి. జీ.వో 217 రద్దు ద్వారా మత్స్యకారులకు నీటి వనరుల వినియోగంపై మరింత స్వేచ్ఛ కల్పించబడింది. వృత్తి ఆధారిత సంక్షేమాన్ని బలోపేతం చేయడంలో ఈ చర్యలు కీలకంగా నిలిచాయి.

*ఇళ్ల కలను నిజం చేసే దిశగా అడుగులు*

ఇప్పటికే 5.5 లక్షల ఇళ్ల పంపిణీ పూర్తిచేసిన ప్రభుత్వం, మరో 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సొంత ఇంటి కలను నెరవేర్చడం ద్వారా పేద కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

*సంక్షేమం నుంచి సాధికారత వైపు... P4 ప్రయోగం*

కేవలం నగదు పంపిణీతోనే కాకుండా పేదరిక నిర్మూలన లక్ష్యంగా P4 కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. బంగారు కుటుంబాలను మార్గదర్శకులుగా నిలబెట్టి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేస్తోంది. ఇది సంప్రదాయ సంక్షేమానికి భిన్నంగా సామాజిక భాగస్వామ్యంతో అభివృద్ధి సాధించే కొత్త నమూనాగా కనిపిస్తోంది.

*తిరుపతి సభలో సంక్షేమ నివేదిక*

రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా తిరుపతిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రభుత్వం తన సంక్షేమ కార్యక్రమాలపై సమగ్ర నివేదికను ప్రజల ముందుంచనుంది. పెన్షన్లు, మహిళా సాధికారత, రైతు సంక్షేమం, విద్యా ప్రోత్సాహకాలు, సామాజిక న్యాయం, పేదరిక నిర్మూలన వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నామని ప్రభుత్వం ఈ వేదిక ద్వారా ప్రజలకు వివరించనుంది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story