AP New Pensions 2026: జూన్ 12 నుంచి కొత్త పెన్షన్లు.. అప్లై చేసుకోండిలా!
AP New Pensions 2026: ఏపీలో వితంతువులకు కూటమి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద జూన్ 12 నుంచి కొత్త వితంతు పెన్షన్ల జారీకి మంత్రి అచ్చెన్నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
జూన్ 12 నుంచి కొత్త పెన్షన్లు.. అప్లై చేసుకోండిలా!
AP New Pensions 2026: ఆంధ్రప్రదేశ్‌లోని అర్హులైన వితంతువులకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో.. సామాజిక పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 'ఎన్టీఆర్ భరోసా' పథకం కింద కొత్త వితంతు పెన్షన్ల (Widow Pensions) మంజూరుకు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జూన్ 12 వ తేదీ నుంచి ఈ కొత్త పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు కొత్త పెన్షన్లను జారీ చేయకపోవడంతో ఎంతోమంది అర్హులు చాన్నాళ్లుగా నిరీక్షిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడంతో అర్హులైన వారు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు సక్రమంగా ఉండి, అధికారులు పరిశీలించి లబ్ధిదారుల జాబితాలో చేర్చిన తర్వాత.. వితంతువులకు ప్రతి నెలా రూ. 4,000 నేరుగా అందుతాయి.
అర్హత నియమాలు ఇవే:
భర్త మరణించిన మహిళలకు మాత్రమే ఈ పెన్షన్ వర్తిస్తుంది.
దరఖాస్తు చేసుకునే మహిళ వయస్సు కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి.
దరఖాస్తుదారుల కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షనర్ ఉండకూడదు.
కుటుంబంలో ఎవరూ ఇన్‌కమ్ ట్యాక్స్ (ఆదాయపు పన్ను) చెల్లించేవారు ఉండకూడదు.
కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్లు:
కొత్త వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేయాలనుకునే వారు తమ సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లి దరఖాస్తు ఫారంతో పాటు కింది పత్రాలను జత చేయాల్సి ఉంటుంది.
ఆధార్ కార్డ్
వైట్ రేషన్ కార్డ్ (తెల్ల రేషన్ కార్డు)
భర్త మరణ ధృవీకరణ పత్రం (Death Certificate)
కుల ధృవీకరణ పత్రం (Caste Certificate)
ఆదాయ ధృవీకరణ పత్రం (Income Certificate)
ఆధార్ అప్‌డేట్ హిస్టరీ జిరాక్స్ (Adhaar Update History)
నెలనెలా రూ. 4 వేల నుంచి రూ. 15 వేల వరకు:
ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అందుతున్న ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా వృద్ధులు, వికలాంగులు, నేత, గీత కార్మికులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. కేటగిరీని బట్టి నెలకు రూ. 4,000 నుంచి గరిష్టంగా రూ. 15,000 వరకు సామాజిక పెన్షన్లను అందిస్తున్నారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 4వ తేదీ లోపు సచివాలయ సిబ్బంది నేరుగా లబ్ధిదారుల ఇంటికే వెళ్లి పింఛన్ డబ్బులను అందజేస్తున్నారు. ఒకవేళ 1వ తేదీ ఆదివారం లేదా పబ్లిక్ హాలిడే వస్తే.. అంతకుముందు రోజే పెన్షన్ పంపిణీ పూర్తి చేయడం విశేషం.




