AP Pension: ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు.. ఏపీ పింఛన్‌దారులకు గుడ్ న్యూస్

AP Pension: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే వృద్ధులు, దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.

CR Reddy
Published on: 11 Sept 2026 8:26 AM IST
AP Pension
X

AP Pension

AP Pension: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే వృద్ధులు, దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సచివాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, అధికారులే నేరుగా దరఖాస్తుదారుల ఇంటి వద్దకే వచ్చి వివరాలు నమోదు చేసుకునేలా కీలక వెసులుబాటు కల్పిస్తూ సెర్ప్ శాఖ నిర్ణయం తీసుకుంది. కొత్తగా పింఛన్ పొందేందుకు ఆశగా ఎదురుచూస్తున్న వృద్ధులు, వికలాంగుల కష్టాలను గుర్తించిన ప్రభుత్వం వారికి పెద్ద ఉపశమనం అందించింది. సచివాలయాలు లేదా ప్రభుత్వ కార్యాలయాల వద్ద గంటల తరబడి నిలబడలేని వారి వద్దకే స్వయంగా విలేజ్ ఆర్గనైజేషన్ యానిమేటర్లు (వివోఏలు), వివోవోబీలు వెళ్తారు. వారి దగ్గర నుంచి అవసరమైన పత్రాలు సేకరించి, దరఖాస్తులను త్వరితగతిన ఆన్‌లైన్‌లో నమోదు చేసే బాధ్యతను ఈ సిబ్బందికి అప్పగించారు. ఈ మేర‌కు సెర్ప్ సీఈవో వాకాటి కరుణ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

సచివాలయాల వద్ద సౌకర్యాలు

పింఛను దరఖాస్తు ప్రక్రియ కోసం గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఎండల తీవ్రత దృష్ట్యా తాగునీటి వసతి నిరంతరం అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. లైన్లలో వేచి ఉండే పరిస్థితి లేకుండా, వచ్చిన వారి దరఖాస్తులను వెంటనే పరిశీలించి ఆన్‌లైన్ చేయాలని సచివాలయ సిబ్బందికి సూచించారు.

పరిశీలన షెడ్యూల్ వివరాలు

సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ కొత్త పింఛన్ల దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 16 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 17 నుంచి 21 వరకు కామన్ ఎలిజిబులిటీ వ్యాలిడేషన్ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 22 నుంచి 24 మధ్య క్షేత్రస్థాయిలో అర్హతల పరిశీలన పూర్తి చేసి సిఫార్సు చేస్తారు. చివరగా సెప్టెంబర్ 25, 26 తేదీల్లో ప్రభుత్వం నుంచి తుది ఆమోదం లభించడంతో పాటు బడ్జెట్ కేటాయింపులు జరుగుతాయి.

పింఛన్ మంజూరుకు ఉండాల్సిన అర్హతలు

ఈ పథకానికి అప్లై చేసుకునేవారికి కొన్ని నిర్దిష్ట నిబంధనలు వర్తిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కుటుంబాల నెలవారీ ఆదాయం రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలకు మించకూడదు. ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు ప్రకారమే వయస్సును పరిగణనలోకి తీసుకుంటారు. కుటుంబంలో సొంత నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా, ఆదాయపు పన్ను చెల్లిస్తున్నా దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. ప్రతినెల కరెంట్ వాడకం 300 యూనిట్ల లోపే ఉండాలి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story