AP Housing: ఏపీలోని నిరుపేదలకు పండగే.. కొత్త ఇళ్ల కేటాయింపుపై కేంద్రం గ్రీన్ సిగ్నల్

AP Housing: ఆంధ్రప్రదేశ్‌లో సొంతింటి కల నెరవేర్చుకోవాలని ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వం తియ్యటి కబురు అందించింది.

CR Reddy
Published on: 30 Aug 2026 6:47 AM IST
AP Housing
X

AP Housing

AP Housing: ఆంధ్రప్రదేశ్‌లో సొంతింటి కల నెరవేర్చుకోవాలని ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వం తియ్యటి కబురు అందించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రానికి ఏకంగా 4 లక్షల ఇళ్లను కేటాయించేందుకు రంగం సిద్ధం చేసింది. వారం నుంచి పది రోజుల్లోనే లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించడానికి చర్యలు వేగవంతం అయ్యాయి. రాష్ట్రంలో స్వంత ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చింది. ఇప్పటికే సమర్పించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన కేంద్రం, విడతల వారీగా జిల్లాలకు ఇళ్లను కేటాయించనుంది. గతంలో ఆమోదించిన 77 వేల ఇళ్లకు అదనంగా ఈ కొత్త ఇళ్లు తోడుకానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9 లక్షల మంది నిరుపేదలకు సొంతింటి వసతి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులకు ఈ విడతలో మొదటి ప్రాధాన్యం దక్కనుంది.

ఆర్ధిక సాయం వివరాలు, అర్హతలు

సొంతంగా స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే నిరుపేదలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడనుంది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2029 వరకు పొడిగించడంతో లబ్ధిదారులకు పెద్ద కొండంత అండ లభించింది. ఈ స్కీమ్ కింద ఇల్లు నిర్మించుకునే ప్రతీ నిరుపేద కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షల సాయం అందించనుండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష వరకు ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఉభయ ప్రభుత్వాలు కలిసి మొత్తం రూ.2.50 లక్షల నగదు సాయాన్ని నేరుగా అర్హుల ఖాతాల్లో జమ చేయనున్నాయి.

పట్టణ ప్రాంతాల్లో ఇళ్లపై కేంద్రం షరతు

గ్రామీణ ప్రాంతాల్లో మంజూరు ప్రక్రియ సజావుగా సాగుతున్నప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో చిన్నపాటి నిరీక్షణ తప్పేలా లేదు. పీఎం ఆవాస్ యోజన అర్బన్ 1.0 కింద ఇదివరకే మంజూరైన 19 లక్షల ఇళ్లలో ఇంకా 3.71 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదు. మరో 4 లక్షల ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో నిలిచిపోయాయి. పెండింగ్‌లో ఉన్న ఈ పాత ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసిన తర్వాతే పట్టణ ప్రాంతాలకు కొత్త ఇళ్లను కేటాయిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

కూటమి ప్రభుత్వం నిరంతర సంప్రదింపులు

కేంద్రంతో సంప్రదింపులు జరిపి అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇల్లు దక్కేలా చూస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. దరఖాస్తు చేసుకున్న నిరుపేదలు అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు. సరైన పత్రాలు సమర్పించిన వారిని తనిఖీ చేసి, త్వరితగతిన లబ్ధిదారుల జాబితాను పంచాయతీల వారీగా ప్రకటించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story