ఏపీకి కేంద్రం బిగ్ ఆఫర్.. రూ.1,264 కోట్లతో కొత్త రైల్వే లైన్లు!

Indian Railways: ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మధ్య బళ్లారి-గుంతకల్ రైల్వే మార్గంలో 3, 4వ లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

Arun Chilukuri
Published on: 25 July 2026 11:28 AM IST
ఏపీకి కేంద్రం బిగ్ ఆఫర్.. రూ.1,264 కోట్లతో కొత్త రైల్వే లైన్లు!
X

ఏపీకి కేంద్రం బిగ్ ఆఫర్.. రూ.1,264 కోట్లతో కొత్త రైల్వే లైన్లు!

Indian Railways: ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య రైల్వే అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) సమావేశంలో బళ్లారి - గుంతకల్ మార్గంలో అదనంగా 3, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోదం ముద్ర వేశారు.

'పీఎం-గతి శక్తి' జాతీయ మాస్టర్ ప్లాన్ కింద చేపడుతున్న ఈ మల్టీట్రాకింగ్ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.1,264 కోట్లు. ఈ విస్తరణ ప్రాజెక్టును 2028-29 నాటికి (మూడేళ్ల వ్యవధిలో) పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు.

ప్రాజెక్టు ముఖ్య విశేషాలు:

మొత్తం పొడవు: 46 కిలోమీటర్లు (ఆంధ్రప్రదేశ్‌లో 22 కి.మీ, కర్ణాటకలో 24 కి.మీ).

వంతెనల నిర్మాణం: 52 చిన్న వంతెనలు, 7 పెద్ద వంతెనలు మరియు వేదవతి నదిపై ఒక మెగా బ్రిడ్జి నిర్మాణం.

లబ్ధిదారులు: 3 జిల్లాల్లోని 99 గ్రామాలు, సుమారు 7 లక్షల మంది జనాభాకు ప్రత్యక్ష ప్రయోజనం.

పర్యాటక ప్రాధాన్యత: బళ్లారి కోట, శ్రీ కుమారస్వామి ఆలయం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు రైలు ప్రయాణం మరింత సులభతరం కానుంది.

సరుకు రవాణాకు బిగ్ బూస్ట్!

బళ్లారి-గుంతకల్ మార్గం ఇనుప ఖనిజం, బొగ్గు, డోలమైట్, సున్నపురాయి, ఉక్కు, ఎరువులు మరియు ఆహార ధాన్యాల రవాణాకు అత్యంత కీలకమైనది. ఈ కొత్త లైన్ల వల్ల అదనంగా 16.22 మిలియన్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యం పెరుగుతుంది. ప్రతి ఏటా సరుకు రవాణా ఖర్చులో రూ.149 కోట్ల ఆదా అవుతుందని రైల్వే శాఖ అంచనా వేసింది.

పర్యావరణానికి మహర్దశ!

ఈ ప్రాజెక్ట్ వల్ల రవాణా వేగం పెరిగి, ఇంధన వినియోగం తగ్గుతుంది. తద్వారా 13.2 మిలియన్ లీటర్ల ముడి చమురు దిగుమతులు ఆదా అవుతాయి. 66.7 మిలియన్ కిలోగ్రాముల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయి (ఇది దాదాపు 2.7 మిలియన్ల చెట్లను నాటడంతో సమానం).

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story