ఏపీలో 12 కొవిడ్ కేసులు.. అప్రమత్తంగా ఉండాలని సూచన
ఆంధ్రప్రదేశ్‌లో 12 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు మృతి చెందగా, ప్రజలు భయపడొద్దని ఆరోగ్య శాఖ సూచించింది.
AP Reports 12 Covid Cases, Health Dept Issues Advisory
ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కొవిడ్-19 కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. జూన్ 26 నుంచి జులై 16 వరకు రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో మొత్తం 12 కొవిడ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం, రాష్ట్రంలో పరీక్షించిన 67 నమూనాల్లో 11 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, మరో కాకినాడ జిల్లాకు చెందిన వ్యక్తికి తమిళనాడులోని వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 12కు చేరింది.
కొవిడ్ బారినపడిన వారిలో నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అయితే వారికి ఇప్పటికే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉండటంతో పాటు ఇతర అనారోగ్య కారణాలు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ముగ్గురు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగా, ఇద్దరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో ముగ్గురు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించారు. అలాగే మరో ఐదు నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పుణెలోని ప్రయోగశాలకు పంపినట్లు తెలిపారు.
రాష్ట్రంలో కేసులు ఒకే ప్రాంతంలో కాకుండా వేర్వేరు ప్రాంతాల్లో నమోదయ్యాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ సూచించింది. అయితే మాస్క్ వినియోగం, వ్యక్తిగత పరిశుభ్రత, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలోని వైద్యులు, ఆస్పత్రులు, ఆరోగ్య సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు వెల్లడించింది.
ఇక దేశవ్యాప్తంగా జులై 1 నుంచి 339 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో కేరళలో 115, కర్ణాటకలో 64, మహారాష్ట్రలో 43, తమిళనాడులో 39, అండమాన్‌లో 18, ఢిల్లీలో 18, రాజస్థాన్‌లో 12 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.




