AP Local Body Elections: స్థానిక పోరులో ఊహించని మలుపు..జగన్ పార్టీకి బిగ్ రిలీఫ్!
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో సుప్రీంకోర్టు కీలక ఆదేశాల నేపథ్యంతో రాష్ట్ర ఎన్నికల సంఘం 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల ఉపసంహరణ, తుది అభ్యర్థుల జాబితా ప్రకటనను తాత్కాలికంగా నిలిపివేసింది.
AP Local Body Elections: స్థానిక పోరులో ఊహించని మలుపు..జగన్ పార్టీకి బిగ్ రిలీఫ్!
AP Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి పీక్స్‌కు చేరిన వేళ, రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల బరిలో దిగేందుకు సర్వం సిద్ధమవుతున్న తరుణంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక సంచలన , కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని ఏకంగా 19 మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
స్థానిక పోరులో నామినేషన్ల ఘట్టం నుంచి రాజకీయం తీవ్ర ఉత్కంఠగా మారింది. అధికార పార్టీ వేధింపులు, ఆటంకాల వల్ల తమ అభ్యర్థులు పలు చోట్ల నామినేషన్లు వేయలేకపోయారని, నామినేషన్ల గడువును పెంచడంతో పాటు అభ్యర్థులకు సరైన రక్షణ కల్పించాలని కోరుతూ వైసీపీ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన దేశ అత్యున్నత నాయస్థానం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతూ కీలక వ్యాఖ్యలు చేసింది:
ఎన్నికలు ఎల్లప్పుడూ అత్యంత పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరగడమే రాజ్యాంగ ప్రాథమిక సూత్రమని తేల్చిచెప్పింది. నామినేషన్లు వేయలేకపోయామని అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, సమర్పించిన ఆధారాలను కేస్-టు-కేస్ ప్రాతిపదికన రాష్ట్ర ఎన్నికల సంఘమే స్వయంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఫిర్యాదులపై ఎస్‌ఈసీ తుది నిర్ణయం తీసుకునే వరకు ఏ అభ్యర్థి తుది జాబితాను ప్రకటించకూడదని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం, తదుపరి చర్యలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను తక్షణమే బ్రేక్ చేసింది.పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటనను తాత్కాలికంగా నిలిపివేసింది.
ఎస్‌ఈసీ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో ఆయా మున్సిపాలిటీల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల సంఘం ఈ ఫిర్యాదులపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? బాధితులకు నామినేషన్లకు మళ్లీ అవకాశం దక్కుతుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎస్‌ఈసీ తీసుకున్న ఈ నిర్ణయం, స్థానిక ఎన్నికల సరళిని ఏ విధంగా మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.




