Ration Card : రేషన్ కార్డు ఉన్నవారికి అలర్ట్.. ఈ పని చేయకపోతే కార్డు కూడా రద్దయ్యే ఛాన్స్

Ration Card : ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డు ఉన్నవారు వెంటనే ఈ-కేవైసీ పూర్తి చేయాలని ప్రభుత్వం కోరింది. లేనిపక్షంలో రేషన్ సరఫరా నిలిచిపోవడంతో పాటు కార్డు రద్దయ్యే అవకాశం ఉంది.

CR Reddy
Published on: 12 May 2026 8:06 AM IST
Ration Card
X

Ration Card

Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో పంపిణీ చేసిన పాత రేషన్ కార్డుల స్థానంలో వచ్చిన స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించి ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎవరైతే ఇప్పటికీ ఈ ప్రక్రియను పూర్తి చేయలేదో, వారికి వచ్చే నెల నుంచి రేషన్ సరుకులు ఆగిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కేవలం బియ్యం మాత్రమే కాదు, ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికం కాబట్టి, కేవైసీ లేకపోతే మిగతా పథకాల నుంచి కూడా అనర్హులుగా మారే అవకాశం ఉంది.

అనర్హుల ఏరివేత.. కేవైసీ తప్పనిసరి

ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల్లో పారదర్శకత పెంచేందుకు, నిజమైన పేదలను గుర్తించేందుకు రేషన్ కార్డుల కేవైసీని ప్రభుత్వం ఆయుధంగా వాడుతోంది. రాష్ట్రంలో చాలా మంది లబ్ధిదారులు ఇప్పటికే స్మార్ట్ కార్డులు పొందినప్పటికీ, వాటికి ఆధార్ అనుసంధానం, వేలిముద్రల ధ్రువీకరణ పూర్తి చేయలేదు. ఈ నిర్లక్ష్యం వల్ల మీ కార్డు ఇన్-యాక్టివ్‌గా మారిపోయే ఛాన్స్ ఉంది. గతేడాది నుంచే ఈ ప్రక్రియ అందుబాటులో ఉన్నా, ఇప్పటికీ కొన్ని లక్షల మంది పెండింగ్‌లో ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అందుకే వీరికి తుది హెచ్చరిక జారీ చేస్తూ, వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.

సరుకులు తీసుకోకపోయినా కార్డు క్లోజ్

కేవలం కేవైసీ మాత్రమే కాదు, రేషన్ సరుకుల విషయంలోనూ ప్రభుత్వం కఠినంగా ఉంది. కొంతమందికి రేషన్ కార్డు ఉన్నప్పటికీ వరుసగా మూడు నాలుగు నెలల పాటు సరుకులు తీసుకోవడం లేదు. ఇలా సరుకులు తీసుకోని వారిని.. వారికి బియ్యం అవసరం లేని వారిగా ప్రభుత్వం పరిగణిస్తోంది. ఫలితంగా అలాంటి కార్డులను కూడా రద్దు చేసే ప్రక్రియను అధికారులు మొదలుపెట్టారు. కాబట్టి మీ కార్డు సురక్షితంగా ఉండాలంటే ఖచ్చితంగా నెలనెలా రేషన్ సరుకులు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ-కేవైసీ ఎలా చేసుకోవాలి?

* ఈ ప్రక్రియ చాలా సులభం. మీరు నేరుగా మీ సమీపంలోని రేషన్ షాపునకు వెళ్లి ఈ-కేవైసీ పూర్తి చేయవచ్చు.

* మీ రేషన్ కార్డు, మీ ఆధార్ కార్డు తీసుకుని డీలర్ వద్దకు వెళ్లండి.

* అక్కడి e-PoS మిషన్‌లో మీ కార్డు నంబర్ నమోదు చేయించి, వేలిముద్ర వేయాలి.

* ఒకవేళ వేలిముద్రలు పడకపోతే, ఐరిస్ (కంటి పాప) స్కాన్ ద్వారా కూడా వివరాలను ధ్రువీకరించవచ్చు.

* ఒకవేళ రేషన్ షాపులో సర్వర్ సమస్యలు ఉంటే, మీ గ్రామంలోని లేదా వార్డులోని సచివాలయానికి వెళ్లి కూడా ఈ కేవైసీ పూర్తి చేయవచ్చు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story