AP 10th Class Results 2026: ఏపీ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
ఏపీ పదో తరగతి ఫలితాలు మే మొదటి వారంలో విడుదల కానున్నాయి. మూల్యాంకనం పూర్తి కావడంతో మార్కుల ప్రాసెసింగ్ వేగవంతం చేసిన విద్యాశాఖ.
AP 10th Class Results 2026
AP SSC 10th Class Results 2026: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల ముగియడంతో, ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపైనే నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 3తో పరీక్షలు పూర్తికాగా, ఏప్రిల్ 15 నాటికి జవాబు పత్రాల మూల్యాంకనం కూడా విజయవంతంగా ముగిసింది. తాజా సమాచారం ప్రకారం, మే మొదటి వారంలో ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది.
హైటెక్ పద్ధతిలో మూల్యాంకనం
ఈ ఏడాది మార్కుల లెక్కింపులో పొరపాట్లు జరగకుండా ప్రభుత్వం సరికొత్త ట్యాబ్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. మూల్యాంకనం కేంద్రాల్లో మార్కులను మాన్యువల్‌గా నమోదు చేయడంతో పాటు, ఎప్పటికప్పుడు ట్యాబ్‌లలోనూ అప్‌లోడ్ చేశారు. ప్రారంభంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురైనప్పటికీ, అధికారులు వాటిని పరిష్కరించి సకాలంలో ప్రక్రియను పూర్తి చేశారు.
ముఖ్య అంశాలు:
పరీక్ష రాసిన వారు: మొత్తం 6,40,916 మంది విద్యార్థులు.
హాజరు శాతం: రికార్డు స్థాయిలో 99.05 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.
పరీక్ష కేంద్రాలు: రాష్ట్రవ్యాప్తంగా 3,415 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు.
ఫలితాల అంచనా: ప్రస్తుతం మార్కుల ప్రాసెసింగ్ జరుగుతోంది. అంతా సవ్యంగా సాగితే మే మొదటి వారంలో ఫలితాలు వెల్లడి కానున్నాయి.
తెలంగాణలోనూ అదే బాటలో..
తెలంగాణలో కూడా పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 13తో ముగిశాయి. సుమారు 5.28 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వగా, అక్కడ కూడా మే మొదటి వారంలోనే ఫలితాలను విడుదల చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.




