Talliki Vandanam: తల్లికి వందనంపై బిగ్ అప్‌డేట్.. రెండో విడత నిధుల విడుదల ఎప్పుడంటే..?

Talliki Vandanam: ఆంధ్రప్రదేశ్‌లో 'తల్లికి వందనం' రెండో విడత నిధుల విడుదల తేదీ , లబ్ధిదారులు అక్టోబర్ లోపు పూర్తి చేయాల్సిన ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాల తనిఖీకి సంబంధించిన పూర్తి వివరాలు.

Gagan kumar
Published on: 4 Oct 2026 7:01 AM IST
Talliki Vandanam
X

Talliki Vandanam: తల్లికి వందనంపై బిగ్ అప్‌డేట్.. రెండో విడత నిధుల విడుదల ఎప్పుడంటే..?

Talliki Vandanam: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకం రెండో విడత ఆర్థిక సాయం కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి విడతలో సాంకేతిక కారణాల వల్ల లబ్ధి పొందని విద్యార్థులతో పాటు, ఈ ఏడాది కొత్తగా ఒకటో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు ఈ రెండో విడతలో నగదు జమ చేయనున్నారు.

గతంలో తొలి విడత కింద జూలై 22న ఏకంగా 64.76 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులను జమ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఒకటో తరగతి, ఇంటర్‌ ఫస్టియర్‌ అడ్మిషన్లు మరియు గత విడతలో సాంకేతిక లోపాల కారణంగా నిధులు అందుకోనివారు మరో 2.7 లక్షల మంది వరకు ఉన్నట్లు అంచనా వేశారు. వీరందరికీ ఆగస్టు 30నే నిధులు విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ తేదీన జమ కాలేదు.

ప్రస్తుతం సుమారు 3 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఈ రెండో విడత నగదు కోసం ఎదురుచూస్తున్న తరుణంలో... అక్టోబర్ తొలి లేదా రెండో వారంలో ఈ నిధులను ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. చిన్న చిన్న సాంకేతిక లోపాల వల్ల మీ పిల్లలకు అందాల్సిన ఆర్థిక సాయం ఆగిపోయే ప్రమాదం ఉంది. అలా జరగకూడదంటే అక్టోబర్ డెడ్‌లైన్‌ లోపు ఈ క్రింది అంశాలను వెంటనే సరిచూసుకోవడం ఎంతో ముఖ్యం.

పాఠశాల రికార్డుల్లో విద్యార్థి పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు సరిగ్గా నమోదయ్యాయో లేదో తనిఖీ చేయండి. విద్యార్థి , తల్లి ఆధార్‌‌ కార్డ్‌ వివరాలు, పేర్లు ఒకేలా ఉన్నాయో లేదో నిర్ధారించుకోండి. ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తికాకపోతే వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి పూర్తి చేయండి. తల్లి బ్యాంకు ఖాతా నంబరు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ముఖ్యంగా బ్యాంక్ ఖాతాకు ఆధార్ సీడింగ్ అయిందో లేదో ఖచ్చితంగా పరిశీలించుకోవాలి. విద్యార్థి చదువుతున్న పాఠశాల లేదా కళాశాల వివరాలు పోర్టల్‌లో అప్‌డేట్ అయ్యాయో లేదో సరిచూడండి.

ఈ చిన్నపాటి వివరాలను మీ సమీపంలోని గ్రామ/వార్డు సచివాలయం లేదా పాఠశాల విద్యాశాఖ అధికారులను సంప్రదించి వెంటనే ధ్రువీకరించుకోండి. మీ కొద్దిపాటి అప్రమత్తతే ప్రభుత్వ పథకం ఫలాలు మీ పిల్లలకు అందేలా చేస్తుంది. చిన్న అజాగ్రత్త వల్ల ప్రయోజనం కోల్పోతే మళ్లీ తదుపరి విద్యా సంవత్సరం వరకు వేచి ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడే మీ వివరాలను ఒకసారి చెక్ చేసుకోండి.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.