Weather Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీ, తమిళనాడు తీరాలకు వాయుగుండం ముప్పు?

Weather Alert: బంగాళాఖాతంలో నవంబర్ 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. 16, 17 తేదీల్లో ఏపీ, తమిళనాడు తీరాలకు వాయుగుండం ముప్పు పొంచి ఉంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 Nov 2026 2:12 AM IST
Weather Alert
X

Weather Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీ, తమిళనాడు తీరాలకు వాయుగుండం ముప్పు?

Weather Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నవంబర్ 13 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది వాయువ్య దిశగా కదులుతూ తదుపరి 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. అనంతరం నవంబర్ 15 నాటికి వాయుగుండంగా మారవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ వ్యవస్థ ఏ దిశగా పయనిస్తుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే నవంబర్ 16, 17 తేదీల్లో దక్షిణ కోస్తాంధ్ర లేదా ఉత్తర తమిళనాడు తీరానికి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఒంగోలు నుంచి చెన్నై, పుదుచ్చేరి మధ్య తీర ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నారు.

అయితే సముద్రం నుంచి భూభాగం వైపు కదిలే సమయంలో పొడి గాలుల ప్రభావంతో ఈ వ్యవస్థ బలహీనపడే అవకాశముందని విశ్లేషిస్తున్నారు. దీంతో ఇది వాయుగుండం లేదా తీవ్ర వాయుగుండం స్థాయిలోనే తీరం దాటవచ్చని అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో దీని కదలిక, తీవ్రతపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మత్స్యకారులకు హెచ్చరికలు

బంగాళాఖాతంలో సముద్ర పరిస్థితులు క్రమంగా మారనున్నాయి. శనివారం నుంచి మంగళవారం వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆగ్నేయ, నైరుతి, మధ్య బంగాళాఖాతంలోని పరిసర ప్రాంతాల్లోకి మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.

ప్రస్తుతం ఈ వాయుగుండం ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై లేదని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీ, యానాం దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత

మరోవైపు తెలంగాణలో చలి ప్రభావం క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో తెల్లవారుజామున, రాత్రి వేళల్లో చలి ఎక్కువగా ఉంటోంది. పగటిపూట మాత్రం ఎండలు కొనసాగుతుండటంతో ఉదయం, రాత్రి చలి.. పగలు ఎండ అన్నట్లుగా వాతావరణం మారింది.

రాబోయే వారం రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశాలు లేవని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే సూచనలు ఉండటంతో ప్రజలు చలి నుంచి రక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్