Weather Update : గంటకు 50 కిమీ వేగంతో ఈదురుగాలులు.. తెలుగు రాష్ట్రాలను ముంచెత్తనున్న వానలు
Weather Update : తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. జూలై 8 వరకు తెలంగాణ, ఏపీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Weather Update
Weather Update : నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే వారం రోజుల పాటు వర్షాలు దంచికొట్టనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ జూలై 8 వరకు భారీ వర్షాల ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, అదే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. జూలై 1 రాత్రి విడుదల చేసిన తాజా వాతావరణ బులెటిన్ ప్రకారం.. ప్రజలు మరికొన్ని రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.
తెలంగాణ ఉత్తర, తూర్పు జిల్లాల్లో వానల జోరు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన వివరాల ప్రకారం.. జూలై 2 నుంచి తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా మొదటి రెండు రోజులు ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే ఛాన్స్ ఉంది. అదే సమయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో గంటకు 30-40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. జూలై 5 నుంచి 8 వరకు కూడా రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ బలమైన ఉపరితల గాలులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ అంచనా వేసింది.
కోస్తా, రాయలసీమలో పిడుగుల భయం
అమరావతి వాతావరణ కేంద్రం నివేదిక ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, యానాం పరిసర ప్రాంతాలలో జూలై 8 వరకు వానలు పలకరించనున్నాయి. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రాబోయే ఐదు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఎలాంటి పెద్ద మార్పులు ఉండవు. జూలై 2 నుంచి 3 మధ్య ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. జూలై 3 నుంచి 4 మధ్య దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేశారు. ఇక జూలై 4, 5 తేదీల్లో రాయలసీమ ప్రాంతంలో అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, పిడుగులు పడే ప్రమాదం కూడా ఎక్కువగా ఉందని హెచ్చరించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలపై ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండనుంది.
నగరాలు, పల్లెల్లో తలెత్తే ఇబ్బందులు
వరుసగా కురిసే భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరాల్లో రహదారులపై భారీగా నీరు నిలిచిపోవడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలగవచ్చు. రోడ్లు జారుడుగా మారడం, బలమైన గాలుల వల్ల చెట్లు, పాత విద్యుత్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉంది. కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు, తాగునీటి సరఫరాకు ఆటంకాలు కలగవచ్చని, డ్రైనేజీ వ్యవస్థలు స్తంభించిపోయే పరిస్థితులు ఉంటాయని ఐఎండీ పేర్కొంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ శాఖ, రహదారి, రైల్వే శాఖల అధికారులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని వాతావరణ కేంద్రం సూచించింది.
ప్రజలకు, రైతులకు వాతావరణ శాఖ కీలక సూచనలు
ఉరుములు, మెరుపులు, పిడుగులు సంభవించే సమయంలో ప్రజలు ఎవరూ కూడా బయట, ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో ఉండకూడదని వాతావరణ శాఖ గట్టిగా విజ్ఞప్తి చేసింది. వర్షం పడే సమయంలో చెట్ల కింద గానీ, లోహపు స్తంభాల పక్కన గానీ నిలబడకూడదు. బలమైన ఈదురుగాలులు వీస్తున్నందున పొలాల్లో పనిచేసే రైతులు, సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు, సాధారణ ప్రజలు కూడా వాతావరణ అప్‌డేట్స్‌ను గమనిస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు స్థానిక అధికారుల సూచనలను పాటిస్తూ సురక్షిత ప్రాంతాల్లో ఉండటం మంచిదని ఐఎండీ స్పష్టం చేసింది.




