Weather Update : ఓ వైపు ఎండలు, మరోవైపు వానలు.. తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం
Weather Update : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు, వర్షాలు ఒకేసారి పడుతూ విచిత్ర వాతావరణం నెలకొంది. ఏపీలో పిడుగుల హెచ్చరికలు జారీ చేయగా, తెలంగాణకు ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
Weather Update
Weather Update : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం అత్యంత విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా జూన్ నెలలో వర్షాలు లేదా ఎండలు ఏదో ఒకటే ఉంటుంది. కానీ ప్రస్తుతం ఇరు రాష్ట్రాల్లో ఒకే సమయంలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటుతూ జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. దానికి భిన్నంగా ఏపీలోని తీరప్రాంత జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వింత మార్పులకు ఎల్ నినో ప్రభావం, స్థానిక వాతావరణ వ్యత్యాసాలే కారణమని అధికారులు చెప్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పిడుగుల హెచ్చరిక
నైరుతి రుతుపవనాల విస్తరణ, ద్రోణి ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రాబోయే ఏడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతాలతో పాటు కాకినాడ, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వానలు పడనున్నాయి. మరోవైపు కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు పడే ప్రమాదం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను హెచ్చరించింది.
తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణలో జూన్ 19 రాత్రి నుంచి వాతావరణం వేగంగా మారబోతోంది. రాష్ట్రంలోని పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ గాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తూ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అలాగే ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ వర్షాలు పడనున్నాయి.
ఉత్తర తెలంగాణలో వడగాలుల ముప్పు
ఒకవైపు వర్ష సూచనలు ఉన్నప్పటికీ, ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో పగటిపూట తీవ్రమైన వడగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు స్పష్టం చేశారు. జూన్ 20 నుంచి 21 వరకు ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, నిజామాబాద్, హన్మకొండ తదితర జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. అయితే రాబోయే రెండు రోజుల తర్వాత రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గే అవకాశం ఉందని చల్లటి వార్త చెప్పారు.
హైదరాబాద్ నగరానికి భారీ వర్ష సూచన
హైదరాబాద్ మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు వాతావరణ శాఖ ఒక ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది. జూన్ 21 నుంచి జూన్ 24 వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో నగరంలో ఉక్కపోత తగ్గి వాతావరణం చల్లబడనుంది. ఐఎండీ సూచనల ప్రకారం.. వర్షాలు, ఈదురుగాలులు వచ్చే సమయంలో ప్రజలు విద్యుత్ స్తంభాలకు, హోర్డింగ్‌లకు దూరంగా ఉండాలని, చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని అధికారులు సూచించారు.




