Weather Update : తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం.. ఈ 30 జిల్లాల ప్రజలు వణికిపోవాల్సిందే

Weather Update : మే 28న తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం. ఏపీలో 46 డిగ్రీల ఎండలతో పాటు 17 జిల్లాల్లో పిడుగులతో కూడిన అకాల వర్షాల హెచ్చరిక జారీ చేసింది ఐఎండీ.

CR Reddy
Published on: 28 May 2026 7:32 AM IST
Weather Update
X

Weather Update 

Weather Update : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎప్పుడూ లేని విధంగా ఒక సరికొత్త గందరగోళానికి దారితీసింది. మే 28న అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో ప్రకృతి రెండు విభిన్న రూపాలను చూపిస్తూ జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకవైపు మాడు పగిలే ఎండలు, తీవ్రమైన వడగాడ్పులతో నిప్పుల కొలిమిని తలపిస్తుంటే.. మరోవైపు అకాల వర్షాలు, ఈదురుగాలులు, భీకర పిడుగులతో వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది. ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, అలాగే దక్షిణ తెలంగాణ వరకు విస్తరించి ఉన్న బలమైన ద్రోణి ప్రభావం వల్లే ఈ అకాల మార్పులు సంభవిస్తున్నాయని వాతావరణ విపత్తుల నిర్వహణ సంస్థలు వెల్లడించాయి.

ఆంధ్రప్రదేశ్‌లో సూర్యుడు తన ప్రతాపాన్ని పీక్స్‌కు తీసుకెళ్తున్నాడు. బుధవారం నాడే పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో అత్యధికంగా 41.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవగా.. ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరంలో 41.6 డిగ్రీలుగా రికార్డయ్యింది. ఇక ఈరోజు (గురువారం) శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో ఏకంగా 45 నుండి 46 డిగ్రీల వరకు తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తీవ్రమైన వడదెబ్బ కారణంగా శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

తీవ్రమైన ఎండల నడుమే ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన కూడా ఉండటం గమనార్హం. ద్రోణి ప్రభావంతో బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, గుంటూరు, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వర్షం పడే సమయంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, కొన్ని ప్రాంతాల్లో భారీ పిడుగులు పడే ప్రమాదం పొంచి ఉన్నందున ప్రజలు, ముఖ్యంగా రైతులు, గొర్రెల కాపరులు చెట్ల కింద నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు హెచ్చరించారు.

ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ కూడా ద్వంద్వ వాతావరణ పరిస్థితులు తారసపడుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో గత రెండు రోజులుగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు దంచికొట్టాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో నగరవాసులకు ఎండల ఉక్కపోత నుంచి పెద్ద ఉపశమనం లభించింది. ఈరోజు కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగానే (40-41 డిగ్రీలు) నమోదవుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే ఓ వైపు ఎండల తీవ్రత తగ్గినందుకు జనం సంతోషిస్తున్నా.. అకాల వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దవడంతో అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు.

వైద్య నిపుణుల ప్రకారం.. వాతావరణంలో ఇలాంటి ఆకస్మిక మార్పులు సంభవించినప్పుడు వైరల్ జ్వరాలు, వడదెబ్బ తగిలే ప్రమాదం చాలా ఎక్కువ. కాబట్టి ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకూడదని సూచిస్తున్నారు. శరీరంలో డీహైడ్రేషన్ రాకుండా ఉండటానికి తగినంత మంచినీరు, ఓఆర్ఎస్ ద్రావణం, మజ్జిగ, కొబ్బరినీళ్లు తీసుకోవాలని.. ఇంట్లోని వృద్ధులు, చిన్నపిల్లల విషయంలో అదనపు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story