Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు
Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
Weather Update:
Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణలోని హైదరాబాద్‌తో సహా పలు జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి వానలు పడే సూచనలు ఉన్నాయి.
ఏపీలో వర్షాల ప్రభావం
ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో అల్పపీడనం ప్రభావం బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంటే, మిగిలిన కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అంచనా వేశారు. వర్షాల సమయంలో ప్రజలు బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మత్స్యకారులకు హెచ్చరికలు
వర్షంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. రోడ్లపై ప్రయాణించే వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు చాలా అప్రమత్తంగా ఉండాలి. సముద్రం తీవ్ర అలజడిగా మారి భారీ అలలు ఎగసిపడే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. పిడుగులు పడే ముప్పు ఉన్నందున వర్షం పడే సమయంలో చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల వద్ద గానీ నిలబడకూడదని హెచ్చరించింది.
తెలంగాణలో వాతావరణ మార్పులు
తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్రంలో కాస్త మిశ్రమ వాతావరణం నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. రుతుపవనాల విరామం వల్ల కొన్ని ప్రాంతాల్లో ఉక్కపోత, తేమ వాతావరణం ఉంటే, మరికొన్ని జిల్లాల్లో వానలు పడనున్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, మహబూబ్‌నగర్, గద్వాల, మెదక్, సిద్దిపేట, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి మధ్య తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల పొడి వాతావరణం కూడా కొనసాగవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.




