Weather Update : తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. రాబోయే వారం పాటు భారీ వర్షాలు, ఈదురుగాలులు
Weather Update : తెలుగు రాష్ట్రాల్లో రానున్న వారం రోజుల పాటు వాతావరణం మారనుంది. ఐఎండీ హెచ్చరికల ప్రకారం ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
Weather Update
Weather Update : తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు విడుదల చేసిన తాజా నివేదికల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న వారం రోజుల పాటు వాతావరణంలో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకోనున్నాయి. జూలై 9వ తేదీ వరకు రెండు రాష్ట్రాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా వర్షం కురిసే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులు సంభవించే ముప్పు ఉన్నందున రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది.
ఏపీలో ఏడు రోజుల పాటు అస్థిర వాతావరణం
ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితిపై అమరావతి కేంద్రం ప్రత్యేక బులిటెన్ విడుదల చేసింది. దీని ప్రకారం ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే ఏడు రోజుల పాటు వాతావరణం పూర్తిగా అస్థిరంగా మారుతుంది. రాబోయే రోజుల్లో చాలా చోట్ల తేలికపాటి వానలు పడతాయి. అయితే ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ హఠాత్తుగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. రాయలసీమ ప్రాంతంలో కూడా ఎక్కువ చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తూ, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో వచ్చే ఐదు రోజుల పాటు పెద్దగా మార్పులు ఉండబోవని, ఉక్కపోత సాధారణంగానే ఉంటుందని ఐఎండీ స్పష్టం చేసింది.
తెలంగాణకు ఐఎండీ ఎల్లో అలర్ట్
తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాబోయే వారం రోజులకు సంబంధించిన వర్ష సూచనను జిల్లాల వారీగా ప్రకటించింది. తెలంగాణవ్యాప్తంగా జూలై 2 రాత్రి నుంచే వర్షాలు ప్రారంభం కాగా, ఇవి జూలై 9 వరకు పలు దఫాలుగా కొనసాగుతాయి. ముఖ్యంగా రాబోయే 24 గంటల్లో (జూలై 3 నుంచి జూలై 4 వరకు) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్‌తో పాటు నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ కుండపోతగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుంచి సాధారణ వర్షాలు కురుస్తాయని సమాచారం.
గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు
జూలై 3 నుంచి జూలై 4 మధ్య కాలంలో తెలంగాణలోని దాదాపు సగానికి పైగా జిల్లాల్లో బలమైన గాలులు వీచనున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఆ తర్వాత జూలై 4 నుండి జూలై 5 వరకు గాలుల తీవ్రత మరింత పెరిగి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఈ సమయంలో చెట్ల కింద, పాత ఇళ్ల కింద ఆశ్రయం పొందవద్దని అధికారులు కోరారు.
ఆదిలాబాద్ నుంచి గద్వాల వరకు వానలు
వారంతాంతంలో కూడా వర్షాల ప్రభావం గట్టిగానే ఉండబోతోంది. జూలై 5 నుంచి జూలై 6 వరకు, అలాగే జూలై 6 నుంచి జూలై 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడి చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. ఆ తర్వాత వచ్చే జూలై 8, జూలై 9 తేదీల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని, ఎక్కడో ఒకచోట వానలు పడుతూనే ఉంటాయని హైదరాబాద్ కేంద్రం తెలిపింది. ఈ వారం రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బలమైన ఉపరితల గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, కాబట్టి విద్యుత్ స్తంభాలు, హోర్డింగుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ సైతం కోరింది.




